Operation Sindhu: ఆపరేషన్ సింధు.. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 380 మంది భారతీయులు

Operation Sindhu 380 Indians Evacuated From Iran and Israel to Delhi
  • ఇవాళ ఇరాన్ నుంచి 219 మంది, ఇజ్రాయెల్ నుంచి 161 మంది ఢిల్లీకి
  • ఇజ్రాయెల్ నుంచి ఇదే మొదటి విమానం, జోర్డాన్ మీదుగా తరలింపు
  • ఇప్పటివరకు ఇరాన్ నుంచి 2,295 మందిని తీసుకొచ్చిన భారత్
  • కేంద్ర సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా స్వయంగా స్వాగతం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సింధు' ద్వారా మంగళవారం మరో 380 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 219 మంది ఇరాన్ నుంచి రాగా, 161 మంది ఇజ్రాయెల్ నుంచి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారికంగా ప్ర‌క‌టించింది.

తాజా రాకతో ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య చిక్కుకున్న మొత్తం 2,295 మంది భారత పౌరులను ఇప్పటివరకు విజయవంతంగా వెనక్కి తీసుకువచ్చినట్లయింది. ఇరాన్‌లోని మషద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం 219 మంది భారతీయులతో న్యూఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా తెలియజేసింది.

"ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 219 మంది భారతీయ పౌరులను తరలించిన ప్రత్యేక విమానం ఈరోజు ఉదయం 03:30 గంటలకు మషద్ నుంచి న్యూఢిల్లీకి చేరుకుంది. దీంతో ఇప్పటివరకు ఇరాన్ నుంచి 2,295 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం" అని పేర్కొంది.

ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియ నిన్న‌ జోర్డాన్ మీదుగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి విమానంలో 161 మంది భారత పౌరులు మంగళవారం ఉదయం 8:20 గంటలకు అమ్మన్ నుంచి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ బృందానికి కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి పబిత్ర మార్గరీటా మాట్లాడుతూ... "ఇజ్రాయెల్ నుంచి తరలించిన 161 మంది భారతీయుల మొదటి బృందానికి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. వీరంతా కొద్దిసేపటి క్రితమే న్యూఢిల్లీ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. మేము అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. ఇరాన్ మరియు ఇజ్రాయెల్‌లోని మన పౌరులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాము. ఆపరేషన్ సింధు కింద పౌరులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు" అని తెలిపారు. 

ప్రమాదకర పరిస్థితుల నుంచి తమను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చినందుకు స్వదేశానికి చేరుకున్న అనేక మంది భారతీయులు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒకరు మాట్లాడుతూ... "హైఫాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ముఖ్యంగా అమెరికా దాడుల తర్వాత. మమ్మల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం మా అదృష్టం" అని అన్నారు. 

మరో ప్రయాణికుడు మాట్లాడుతూ... "విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అద్భుతంగా పనిచేసింది. తరలింపు ప్రక్రియ చాలా సజావుగా సాగింది. మా ప్రయాణాన్ని ఇంత సౌకర్యవంతంగా చేసినందుకు మంత్రిత్వ శాఖకు నా కృతజ్ఞతలు" అని తెలిపారు.
Operation Sindhu
Iran
Israel
Indian Evacuation
MEA
Pabitra Margherita
Indians in Iran
Indians in Israel
Middle East Crisis
New Delhi

More Telugu News