Donald Trump: ఇరాన్, ఇజ్రాయెల్ లకు ట్రంప్ హెచ్చరిక

Donald Trump Warns Iran Israel on Ceasefire
  • కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని ప్రకటన
  • ఎవరూ ఉల్లంఘించ వద్దన్న అమెరికా అధ్యక్షుడు
  • 12 రోజుల యుద్ధానికి తెరపడుతుందని ఆశాభావం
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత కొద్ది గంటలుగా ఇరాన్ పలు దఫాలుగా ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులతో దాడులు చేసిన నేపథ్యంలో, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ట్రంప్ ఇరు దేశాలను హెచ్చరించారు. "కాల్పుల విరమణ ఇప్పుడు అమల్లో ఉంది. దయచేసి దీన్ని ఉల్లంఘించవద్దు" అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పన్నెండు రోజుల పాటు సాగిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం సుమారు 0400 జీఎంటీ నుంచి 24 గంటల పాటు దశలవారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని, తొలుత ఇరాన్ ఏకపక్షంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇదే బాటలో నడుస్తుందని ఆయన ముందుగా తెలిపారు.

ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగాలపై ఐదు దఫాలుగా క్షిపణి దాడులు జరిపిన అనంతరం ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా వెల్లడించింది. ఈ దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌లో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ముందు టెహ్రాన్ చివరి రౌండ్ క్షిపణులను ప్రయోగించిందని ఇరాన్‌కు చెందిన ఎస్ఎన్ఎన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

క్షిపణి దాడులు ముగియడంతో, ప్రజలు షెల్టర్ల సమీప ప్రాంతాల నుంచి బయటకు రావచ్చని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. "పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, దేశవ్యాప్తంగా రక్షిత ప్రదేశాల సమీపంలో ఉండాలన్న నిబంధనను హోమ్ ఫ్రంట్ కమాండ్ ఎత్తివేసింది" అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో జరిపిన చర్చల ద్వారా ట్రంప్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారని, ఇరాన్ ఇకపై దాడులు చేయనంత కాలం ఇజ్రాయెల్ దీనికి అంగీకరించిందని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధ్రువీకరించింది. అయితే, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కూడా నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
Donald Trump
Iran Israel conflict
ceasefire agreement
Benjamin Netanyahu
Middle East tensions
missile attacks
Israel military
Tehran
White House

More Telugu News