Ananthkumar Hegde: ముస్లిం కుటుంబంపై రోడ్డుపైనే దాడి.. కర్ణాటకలో బీజేపీ మాజీ ఎంపీపై ఎఫ్ఐఆర్

Ananthkumar Hegde Booked for Attacking Muslim Family in Karnataka
  • కర్ణాటక మాజీ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేపై దాడి కేసు
  • కులపరమైన దూషణలు.. చంపుతామని బెదిరింపులు
  • హెగ్డేతో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు
  • దాడిలో తాను పాల్గొనలేదన్న హెగ్డే
కర్ణాటకకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డుపై జరిగిన ఓ ఘర్షణలో ముస్లిం కుటుంబంపై దాడి చేసి, కులం పేరుతో దూషించి, చంపుతామని బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  

పోలీసుల కథనం ప్రకారం.. హలేనహళ్లికి చెందిన సైఫ్‌ఖాన్ నిన్న తన కుటుంబంతో కలిసి తుమకూరులో ఓ వివాహ వేడుకకు హాజరై ఇన్నోవా క్రిస్టా కారులో తిరిగి వస్తున్నారు. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో నిజగల్ సమీపంలో తెలుపు రంగు ఎక్స్‌యూవీ700 కారు ఒకటి వారి వాహనాన్ని అడ్డగించింది. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరు ‘నేను డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాను’ అని అరుస్తూ తమ కారును రోడ్డు పక్కకు ఆపమని బలవంతం చేశారని సైఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం, ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి, తనను తాను గన్‌మ్యాన్‌గా చెప్పుకుంటూ సైఫ్‌పై చేయి చేసుకున్నాడు. మరో వ్యక్తి సైఫ్ సోదరుడు సల్మాన్ ఖాన్‌ను కారులోంచి బయటకు లాగి దాడి చేయడంతో అతని మూడు పళ్లు విరిగిపోయాయి. మూడో వ్యక్తి అనంతకుమార్ హెగ్డే అని సైఫ్ గుర్తించారు. ‘వాళ్లు సాబ్రు గ్రూప్ వాళ్లు, కొట్టండి!’ అంటూ హెగ్డేనే దాడికి పురిగొల్పారని సైఫ్ ఆరోపించారు. ‘సాబ్రు’ అనే పదాన్ని కర్ణాటకలో ముస్లింలను కించపరిచేందుకు వాడే గ్రామ్య పదంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి సమయంలో ‘తక్కువ సాబ్రు కులం’ వంటి కులపరమైన దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

తమపై దాడిని ప్రశ్నించిన తన తల్లి గుల్ ఉన్నీసా మెడ పట్టుకుని, బట్టలు లాగి, తలపై కొట్టి కిందపడేశారని హెగ్డేపై సైఫ్ ఆరోపణలు చేశారు. సైఫ్ మామ ఇలియాస్ ఖాన్‌పైనా హెగ్డే దాడి చేశారని, ఈ దాడిలో ఆయన పళ్లు విరిగి రక్తస్రావమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మ్యాన్ తుపాకీ చూపిస్తూ తమ కుటుంబాన్ని కాల్చి చంపుతామని బెదిరించినట్టు కూడా తెలిపారు.

తీవ్ర గాయాలపాలైన బాధితులను దాబస్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సమక్షంలో సైఫ్ ఖాన్ నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్న అనంతరం, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాబస్‌పేట్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అనంతకుమార్ హెగ్డేను మొదటి నిందితుడిగా (ఏ1), ఆయన గన్‌మ్యాన్, డ్రైవర్‌లను వరుసగా ఏ2, ఏ3లుగా పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. లభించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్లడించారు.

ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ, హెగ్డే కారును మరో వాహనం ఓవర్‌టేక్ చేయడంతో ఈ గొడవ ప్రారంభమైందని తెలిపారు. దీనికి ప్రతిగా హెగ్డే గన్‌మ్యాన్, డ్రైవర్ ఆ కారును ఆపి, అందులోని వ్యక్తిపై దాడి చేశారని చెప్పారు. "అనంతకుమార్ హెగ్డే స్వయంగా ఎవరిపైనా దాడి చేయలేదని పోలీసులు నాకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు జరుగుతోంది, తగిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనలో హెగ్డే ప్రమేయం ఉందా లేదా అనేది విచారణలో తేలుతుంది" అని ఆయన వివరించారు.
Ananthkumar Hegde
Karnataka BJP
Muslim family attack
Tumakuru
G Parameshwara
Halenahalli
Communal violence Karnataka
Saif Khan
Sabru slur
FIR

More Telugu News