Yang: 12 ఏళ్ల వయసులో మింగిన బ్రష్.. 64 ఏళ్ల వయసులో బయటకు!

Yang 64 year old man tooth brush removed after 52 years
  • కడుపునొప్పితో ఆసుపత్రికి వెళితే ఎక్స్ రేలో కనిపించిన 17 సెం.మీ. టూత్‌బ్రష్
  • చైనాలో 64 ఏళ్ల వ్యక్తి కడుపులో నుంచి బ్రష్ వెలికి తీసిన వైద్యులు
  • 52 ఏళ్ల తర్వాత శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు
  • పేగుల్లో కదలకుండా ఉండటంతో ప్రమాదం తప్పిందన్న డాక్టర్లు 
చైనాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. 52 ఏళ్ల క్రితం మింగిన ఒక టూత్‌బ్రష్‌ను వైద్యులు 64 ఏళ్ల వ్యక్తి శరీరం నుంచి తాజాగా బయటకు తీశారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన యాంగ్ అనే వ్యక్తికి సాధారణ జీర్ణవ్యవస్థ పరీక్షలు చేస్తుండగా, అతని చిన్న పేగులో 17 సెంటీమీటర్ల పొడవైన టూత్‌బ్రష్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. యాంగ్ తన 12వ ఏట ఈ టూత్‌బ్రష్‌ను మింగినట్లు గుర్తుచేసుకున్నారు. భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. టూత్‌బ్రష్ దానంతట అదే కరిగిపోతుందని భావించానన్నారు. 52 ఏళ్లుగా బ్రష్ కడుపులోనే ఉన్నప్పటికీ యాంగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం గమనార్హం.

ఈ విషయం తెలిసిన వెంటనే, వైద్యులు యాంగ్‌కు ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించి, 80 నిమిషాల్లో టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించారు. గత మూడేళ్లలో ఒక రోగి జీర్ణవ్యవస్థ నుంచి వస్తువును తీయడానికి ఇంత ఎక్కువ సమయం పట్టడం ఇదే మొదటిసారని వైద్యులు పేర్కొన్నారు. పేగుల్లో ఇలాంటి వస్తువులు కదులుతూ లోపలి కణజాలాన్ని పాడుచేసి, ప్రాణాంతకమైన పేగుల చిల్లులు (ఇంటెస్టినల్ పెర్ఫొరేషన్) కలిగించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.

యాంగ్ విషయంలో, టూత్‌బ్రష్ అదృష్టవశాత్తూ పేగులోని ఒక వంపులో కదలకుండా ఉండిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వారు వివరించారు. యాంగ్ శరీరం నుంచి టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించిన వార్త వైరల్ అవ్వడంతో, ఇన్నేళ్లపాటు శరీరానికి ఎలాంటి హానీ కలగకపోవడం అతని అదృష్టమని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
Yang
China
tooth brush
swallowed object
medical surgery
endoscopic surgery
intestinal perforation
digestive system
foreign object

More Telugu News