Sriram: నేను డ్రగ్స్ అమ్మలేదు... కొనుగోలు చేశాను: శ్రీరామ్

Actor Sriram seeks bail citing sons illness in drugs case
  • డ్రగ్స్ కేసులో శ్రీరామ్ అరెస్ట్
  • రిమాండ్ విధించిన ఎగ్మోర్ కోర్టు
  • సెలబ్రిటీగా డ్రగ్స్ తీసుకోవడం తప్పేనన్న శ్రీరామ్
డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన నటుడు శ్రీరామ్, తాను మత్తుపదార్థాలు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. అయితే, తాను వాటిని విక్రయించలేదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న శ్రీరామ్‌ను పోలీసులు మంగళవారం ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.

"నేను ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదు. తెలిసిన వారి దగ్గర నుంచి మత్తుపదార్థాలు కొనుగోలు చేశాను" అని శ్రీరామ్ తెలిపారు. ఒక సెలబ్రిటీగా ఉండి డ్రగ్స్ తీసుకోవడం తప్పేనని ఆయన అంగీకరించారు.

కాగా, ప్రస్తుతం తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, సంరక్షకుడిగా ఆ బాధ్యత తనపై ఉందని పేర్కొంటూ, తనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

పోలీసులు శ్రీరామ్‌ను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించినట్లు సమాచారం. విచారణలో వెల్లడైన అంశాలతో పాటు, ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఎగ్మోర్ కోర్టు న్యాయమూర్తి... శ్రీరామ్‌కు జూలై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శ్రీరామ్‌ను జైలుకు తరలించారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ కేసు టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారంపై చర్చకు దారితీసింది. 
Sriram
Sriram actor
Drugs case
Chennai drugs
Egmore court
Tollywood drugs
Judicial remand
Bail petition
Drug purchase

More Telugu News