Jyothula Nehru: తలకాయలు తీసే జగన్ కు తాటికాయ చూస్తే భయం వేస్తోందా?: జ్యోతుల నెహ్రూ

Jyothula Nehru Slams Jagans Actions in Andhra Pradesh
  • మంగళగిరిలో జ్యోతుల నెహ్రూ ప్రెస్ మీట్
  • రాష్ట్రంలో అశాంతికి జగన్ కుట్ర అంటూ ఆరోపణలు
  • సుపరిపాలన చూసి ఓర్వలేకపోతున్నాడని విమర్శలు
  • జగన్ ఎప్పుడు బయటికి వచ్చినా విధ్వంసం సృష్టిస్తున్నాడని వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తుల మృతికి కారకుడయ్యారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతుంటే, ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా విధ్వంసమే సృష్టిస్తున్నారని నెహ్రూ విమర్శించారు. పొదిలిలో అరాచక శక్తులను ఉసిగొల్పి హింసకు పాల్పడ్డారని, ఈ ఘటనను అందరూ చూశారని అన్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించి, ఆ నెపంతో ముగ్గురి ప్రాణాలు పోవడానికి జగన్ కారణమయ్యారని ఆయన ఆరోపించారు. 

పల్నాడులో జగన్ కాన్వాయ్ కిందపడి వైసీపీ కార్యకర్త మరణిస్తే, వాహనం ఆపకుండా నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయారని, సమయానికి ఆసుపత్రికి తరలించి ఉంటే ఆ వ్యక్తి బతికేవాడని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అంబులెన్స్‌కు దారివ్వకపోవడం వల్ల మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇది జగన్ సంస్కారహీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కారు కింద కార్యకర్త పడిన విషయం తనకు తెలియదని చెప్పడం, తర్వాత డబ్బులు పంపానని చెప్పడం జగన్ రెడ్డి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని, డబ్బులతో తప్పును కప్పిపుచ్చలేరని హితవు పలికారు. ప్యాలెస్ ముందు తాటికాయ పడితేనే నానా యాగీ చేసిన జగన్ వైసీపీ కార్యకర్త తలకాయ కారు కింద పడితే పట్టించుకోలేదని మండిపడ్డారు. "తలకాయలు తీసే జగన్మోహన్ రెడ్డికి తాటికాయ చూస్తే భయం వేస్తోందా?" అంటూ నెహ్రూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

జగన్ రెడ్డి లక్ష్యం ఒక్కటేనని, అరాచక శక్తులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ సుపరిపాలనను అడ్డుకోవడమేనని నెహ్రూ ఆరోపించారు. చంద్రబాబు సమర్థవంతమైన పాలనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని, జగన్ ఎన్ని కుట్రలు చేసినా తిరిగి అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. గతంలో శవ రాజకీయాలతో అధికారం చేపట్టిన జగన్, ఇప్పుడు మళ్లీ అదే పంథాలో కుట్రలకు తెరలేపుతున్నారని, అయితే ప్రజలు ఆయన నీచ రాజకీయాలను ఇప్పటికే తిరస్కరించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నారని జ్యోతుల నెహ్రూ తెలిపారు. తమ ప్రభుత్వం జగన్ లాగా నియంతృత్వ విధానాలను అవలంబించడం లేదని, అయినప్పటికీ తనను నియంత్రిస్తున్నారంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి కార్యకర్తలు జగన్ బెదిరింపులకు భయపడరని, ఆయన కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని నెహ్రూ పేర్కొన్నారు.
Jyothula Nehru
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh Politics
Telugu Desam Party
TDP
Andhra Pradesh Government
Chandrababu Naidu
Political Criticism
Andhra Pradesh

More Telugu News