Lavu Sri Krishna Devarayalu: ఒకరిని పరామర్శించేందుకు వచ్చి... ముగ్గురిని చంపేశారు: జగన్ పై శ్రీకృష్ణదేవరాయలు ఫైర్

Lavu Sri Krishna Devarayalu Fires at Jagan Over Palnadu Visit Deaths
  • మాజీ స్పీకర్ కోడెల విగ్రహావిష్కరణలో టీడీపీ నేతల వ్యాఖ్యలు
  • బెట్టింగ్ రాయుడి కుటుంబాన్ని పరామర్శించడం సిగ్గుచేటన్న కన్నా
  • పరామర్శ పేరుతో జగన్ అలజడి సృష్టించారన్న కృష్ణదేవరాయలు
వైసీపీ అధినేత జగన్ ఇటీవల పల్నాడు జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించడంపై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరామర్శ పేరుతో జగన్ అరాచకాన్ని సృష్టించారని వారు ఆరోపించారు.

మంగళవారం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరులో టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఒక బెట్టింగ్ రాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళ్లడం సిగ్గుచేటని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పరామర్శ పేరుతో వచ్చి, జగన్ అరాచకం సృష్టించారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్యకు కూడా జగనే కారణమని కన్నా ఆరోపించారు. తాజాగా ఆయన పర్యటన వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ, రెంటపాళ్లలో పరామర్శ పేరుతో వైఎస్ జగన్ సత్తెనపల్లిలో అలజడి సృష్టించారని ఆరోపించారు. జగన్ భారీ కాన్వాయ్‌తో అట్టహాసంగా చేసిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయి, అంబులెన్స్‌కు దారి దొరక్క ఒకరు మరణించారని తెలిపారు. మరో ఇద్దరు కూడా ఇదే పర్యటన వల్ల చనిపోయారని ఆయన వివరించారు. ఒకరిని పరామర్శించడానికి వచ్చి, ముగ్గురి మరణానికి కారణమయ్యారని జగన్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
Lavu Sri Krishna Devarayalu
YS Jagan
Palnadu district
Andhra Pradesh politics
Kanna Lakshminarayana
TDP
YSRCP
Road accident
Political criticism
Ap politics

More Telugu News