NSG Commando: 'ఆపరేషన్ సిందూర్' సాకు కుదరదు: కమాండో అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

NSG Commando Plea Rejected by Supreme Court in Dowry Death Case
  • వరకట్న హత్య కేసులో ఎన్‌ఎస్‌జీ కమాండోకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్నందున మినహాయింపు కోరిన కమాండో
  • దేశసేవ చేసినా, గృహహింస నుంచి రక్షణ కల్పించలేమన్న ధర్మాసనం
  • ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సమర్థించిన హైకోర్టు, సుప్రీంకోర్టు
  • రెండు వారాల్లో లొంగిపోవాలని కమాండోకు సుప్రీంకోర్టు ఆదేశం
దేశ రక్షణ విధుల్లో పాల్గొన్నంత మాత్రాన తీవ్రమైన నేరారోపణల నుంచి మినహాయింపు లభించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వరకట్నం కోసం భార్యను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎన్‌ఎస్‌జీ కమాండో, తాను ‘ఆపరేషన్ సిందూర్’లో పాలుపంచుకున్నందున కేసు నుంచి రక్షణ కల్పించాలని చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇంట్లో జరిగిన దారుణమైన ఘటనలకు ఇటువంటి కారణాలతో రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది.

ఎన్‌ఎస్‌జీలోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్‌లో పనిచేస్తున్న సదరు కమాండోపై వరకట్నం కోసం తన భార్యను హత్య చేశాడనే తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు కాగా పంజాబ్‌లోని ఓ ట్రయల్ కోర్టు 2004లో విచారణ చేపట్టింది. విచారణ అనంతరం, కమాండోను దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. హైకోర్టు, ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ, కమాండో అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టులో వాదనలు

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, "నేను బ్లాక్ క్యాట్ కమాండోను. ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్నాను. ఈ కేసులో లొంగిపోవాల్సిన అవసరం లేకుండా నాకు మినహాయింపు కల్పించండి" అని ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, కమాండో విజ్ఞప్తి పట్ల అసహనం వ్యక్తం చేసింది.

"మీరు ఆపరేషన్‌లో పాల్గొన్న కారణాన్ని చూపి, ఇంట్లో జరిగిన ఇంతటి దారుణ ఘటన నుంచి రక్షణ కోరలేరు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇందులో మీకు ఎటువంటి మినహాయింపులు కల్పించలేం" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెంటనే లొంగిపోవాలని కమాండోను ఆదేశించింది. అయితే, లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని పిటిషనర్ కోరగా, రెండు వారాల గడువును మంజూరు చేసింది.
NSG Commando
Operation Sindoor
Supreme Court
Dowry death case
Black Cat Commando

More Telugu News