Vande Bharat Express: వందే భారత్ రైలులో నీరు లీకేజీ... స్పందించిన రైల్వే శాఖ

Vande Bharat Express Water Leakage Railway Ministry Responds
  • ఢిల్లీ వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి లీకేజీతో ప్రయాణికుల అవస్థలు
  • రైలు బోగీ పైకప్పు నుంచి కారుతున్న నీటితో తడిసిన సీట్లు, లగేజీ
  • ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
  • ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రయాణికుడు
  • ఏసీ డ్రెయిన్ రంధ్రాలు మూసుకుపోవడమే కారణమన్న రైల్వే శాఖ
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళుతున్న వందే భారత్ రైలులో పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన కారణంగా సీట్లు తడిసిపోవడమే కాకుండా, ప్రయాణికుల సామాన్లు కూడా నీటితో తడిసిపోయాయి. ఈ పరిస్థితిని ఒక ప్రయాణికుడు తన కెమెరాలో బంధించగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

జూన్ 23న వారణాసి నుంచి న్యూఢిల్లీ వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైలు సి-7 కోచ్‌లోని 76వ నంబర్ సీటు వద్ద ఈ సమస్య తలెత్తింది. రైలు ప్రయాణంలో ఉండగా, ఒక్కసారిగా పైకప్పు నుంచి నీరు కారడం మొదలైంది. దీనితో పాటు ఏసీ కూడా సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు అధికమయ్యాయి.

ఈ ఘటనపై దర్శిల్ మిశ్రా అనే ప్రయాణికుడు 'ఎక్స్' వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "వందే భారత్ రైల్లో ఏసీ పనిచేయడం లేదు, పైగా నీళ్లు కారుతున్నాయి. అధిక ఛార్జీలు చెల్లించినా ప్రయాణం చాలా అసౌకర్యంగా ఉంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి" అంటూ తన పీఎన్ఆర్ నంబర్‌తో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఆర్‌సీటీసీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే సేవలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

రైల్వే శాఖ స్పందన

ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. తమ అధికారిక 'ఎక్స్' ఖాతా 'రైల్వే సేవ' ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది. "ట్రైన్ నంబర్ 22415 (వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్) లోని సి-7 కోచ్ (సీటు నెం. 76) లో రిటర్న్ ఎయిర్ డక్ట్ నుంచి నీరు లీక్ అయినట్లు ఫిర్యాదు అందింది. ఆర్‌ఎంపీయూ కూలింగ్ కాయిల్ కింద ఉండే డ్రిప్ ట్రేలోని డ్రెయిన్ రంధ్రాలు, రిటర్న్ ఎయిర్ ఫిల్టర్ కారణంగా మూసుకుపోయాయి. దీనివల్ల ఏసీ నుంచి వచ్చిన నీరు అక్కడ పేరుకుపోయింది" అని రైల్వే సేవ పోస్ట్ చేసింది.

"రైలు బ్రేక్ వేసినప్పుడు, పేరుకుపోయిన ఆ నీరు రిటర్న్ ఎయిర్ డక్ట్‌లోకి ప్రవేశించి, ప్రయాణికుల ప్రాంతంలోకి లీక్ అయింది. ఈ సమస్యను గుర్తించి, తగిన చర్యలు తీసుకున్నాం" అని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
Vande Bharat Express
Vande Bharat
Indian Railways
Train Water Leakage
New Delhi

More Telugu News