Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యపై గుజరాత్ ప్రభుత్వం ప్రకటన

Air India Ahmedabad Crash Death Toll Announced by Gujarat Government
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 275 మంది మృతి 
  • గుజరాత్ ఆరోగ్యశాఖ ప్రకటన
  • మృతుల్లో 241 మంది ప్రయాణికులు, 34 మంది స్థానికులు
  • డీఎన్‌ఏ పరీక్షలతో 260 మృతదేహాల గుర్తింపు పూర్తి
  • విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 275కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది విమాన ప్రయాణికులు కాగా, కొందరు స్థానికులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మృతుల సంఖ్యపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటనతో తెరపడింది.

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 275 మంది మరణించగా, వారిలో 241 మంది విమాన ప్రయాణికులని, మిగిలిన 34 మంది విమానం కూలిన ప్రాంతంలోని స్థానికులని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు డీఎన్ఏ పరీక్షల ద్వారా 260 మంది మృతులను గుర్తించగా... వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. గుర్తించిన మృతదేహాల్లో 256 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వివరించారు.

ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో, 11ఏ సీటులో కూర్చున్న ఒక్క వ్యక్తి మినహా మిగతా వారందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం స్థానికంగా ఉన్న వైద్య కళాశాల విద్యార్థుల వసతి గృహంపై పడటంతో, అక్కడ ఉన్న పలువురు వైద్య విద్యార్థులు, ఇతర స్థానికులు కూడా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Air India
Air India crash
Ahmedabad
Gujarat
Plane crash
Death toll
Air disaster
Dreamliner
London flight

More Telugu News