US Embassy: అమెరికాకు అక్రమ వలసలు, వీసా ఉల్లంఘనలపై యూఎస్ ఎంబసీ వార్నింగ్‌!

US Embassy Warns Against Illegal Immigration and Visa Violations
  • అక్రమంగా అమెరికా వెళ్తే కఠిన చర్యలు తప్పవని యూఎస్ ఎంబసీ హెచ్చరిక
  • నిర్బంధం, బహిష్కరణతో పాటు భవిష్యత్తులో శాశ్వత వీసా నిషేధం
  • వీసా అనేది హక్కు కాదు, కేవలం ఒక ప్రివిలేజ్ మాత్రమేనని స్పష్టీకరణ
  • చట్టాలు ఉల్లంఘిస్తే జారీ అయిన వీసానైనా రద్దు చేసే అధికారం
అమెరికా వెళ్లాలని ఆశించే భారతీయులకు ఆ దేశ రాయబార కార్యాలయం మరోసారి కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. చట్టవిరుద్ధ మార్గాల్లో తమ దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే నిర్బంధంతో పాటు దేశం నుంచి బహిష్కరణకు గురవుతారని తెలిపింది. అలాగే భవిష్యత్తులో అమెరికా వీసాకు శాశ్వతంగా అనర్హులుగా మారతారని యూఎస్ ఎంబసీ తేల్చి చెప్పింది.

అక్రమంగా అమెరికాలో అడుగుపెడితే జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చని లేదా బలవంతంగా స్వదేశానికి తిప్పి పంపించేస్తారని రాయబార కార్యాలయం తెలిపింది. ఎంత భారీగా ఖర్చు పెట్టి, ప్రమాదకరమైన దారుల్లో ప్రయాణించినప్పటికీ, చట్టపరమైన చిక్కులతో పాటు జీవితకాలంపై ఒక చెరగని ముద్ర పడుతుందని వివరించింది. ఇలాంటి చర్యలు భవిష్యత్తు అవకాశాలను దెబ్బతీస్తాయని పేర్కొంది.

అమెరికా వీసా అనేది ఒక హక్కు కాదని, అది కేవలం ఒక ప్రత్యేక సదుపాయం (ప్రివిలేజ్) మాత్రమేనని ఎంబసీ స్ప‌ష్టం చేసింది. వీసా మంజూరు చేసిన తర్వాత కూడా నిరంతర పరిశీలన ఉంటుందని తెలిపింది. ఎవరైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే, అధికారులు ఆ వీసాను రద్దు చేసే పూర్తి అధికారం కలిగి ఉంటారని స్పష్టం చేసింది. అందుకే వీసా పొందినంత మాత్రాన అన్నీ సవ్యంగా ఉన్నట్లు కాదని సూచించింది.

ముఖ్యంగా స్టూడెంట్ వీసా లేదా పర్యాటక వీసాపై అమెరికా వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని రాయబార కార్యాలయం తెలియ‌జేసింది. అక్కడ ఉన్న సమయంలో మాదకద్రవ్యాలు తీసుకోవడం లేదా ఇతర అమెరికా చట్టాలను ఉల్లంఘించడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే, భవిష్యత్తులో అమెరికా వీసా పొందే అర్హతను శాశ్వతంగా కోల్పోతారని గట్టిగా హెచ్చరించింది. అందువల్ల అమెరికా చట్టాలను, నిబంధనలను గౌరవించాలని, వాటికి కట్టుబడి ఉండాలని యూఎస్ ఎంబసీ కోరింది.
US Embassy
America illegal immigration
US visa violations
Indian immigrants
US student visa
US tourist visa
US immigration law
visa ban
deportation
illegal entry

More Telugu News