Kavitha: రైల్ రోకో కార్యక్రమానికి వామపక్షాల మద్దతు కోరిన కవిత

Kavitha Seeks Left Parties Support for Rail Roko
  • తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జులై 17న రైల్ రోకో
  • వామపక్షాల మద్దతు కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జులై 17న నిర్వహించ తలపెట్టిన రైల్ రోకో నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలను కల్వకుంట్ల కవిత కోరారు.

ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అడిక్‌మెట్‌లోని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు, జేవీ చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె. గోవర్థన్‌లను కవిత వేర్వేరుగా కలిసి వినతి పత్రాలను అందజేసి మద్దతు కోరారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో గత ఏడాదిగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్వహించామని కవిత ఈ సందర్భంగా వామపక్ష నేతలకు తెలియజేశారు.

తెలంగాణ జాగృతితో పాటు బీసీ సంఘాలు చేసిన ఆందోళనల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ, కౌన్సిల్‌లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిందని కవిత వివరించారు.

అయితే ఈ బిల్లును పంపి మూడు నెలలు అవుతున్నా అమలు చేయడానికి కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే జులై 17న రైల్ రోకోకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. తమతో కలిసి వచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి రైల్ రోకో నిర్వహిస్తామని కవిత వామపక్ష పార్టీ నేతలకు తెలిపారు. 
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
BC Reservations
Rail Roko
CPM
Left Parties Support
Revanth Reddy
Telangana Politics
BC Declaration

More Telugu News