Jammu Kashmir: ఖాకీల అమానుషం.. నిందితుడికి చెప్పుల దండ వేసి ఊరేగింపు!

Cops Garland Thief With Shoes And Parade Him In Jammu
  • జమ్మూలో దొంగతనం ఆరోపణలపై వ్యక్తికి పోలీసుల చిత్రహింసలు
  • నిందితుడి మెడలో చెప్పుల దండ వేసి వాహనంపై ఊరేగింపు
  • సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్, తీవ్ర దుమారం
  • పోలీసుల చర్యపై ఉన్నతాధికారుల శాఖాపరమైన విచారణకు ఆదేశం
జమ్మూకశ్మీర్‌లో దొంగతనం ఆరోపణలపై పట్టుబడిన ఓ వ్యక్తి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. రోగి సహాయకుడి వద్ద నుంచి వేలాది రూపాయలు అపహరించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పోలీసులు దేహశుద్ధి చేయడమే కాకుండా, మెడలో చెప్పుల దండ వేసి పోలీసు వాహనం బానెట్‌పై కూర్చోబెట్టి ఊరేగించారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మార‌డంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొద్ది రోజుల క్రితం ఓ ఆసుపత్రి వద్ద రోగి కోసం మందులు కొనుగోలు చేస్తున్న వ్యక్తి నుంచి నిందితుడు సుమారు రూ. 40 వేలు దొంగిలించి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. తాజాగా బాధితుడు అదే ఆసుపత్రి పరిసరాల్లో నిందితుడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో బాధితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని సమాచారం. ఆ సమయంలో అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి, కొందరు పోలీసులు ఆ వ్యక్తి చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంత‌రం అత‌ని మెడలో చెప్పుల దండ వేసి, పోలీసు వాహనం బానెట్‌పై కూర్చోబెట్టి నడివీధుల్లో ఊరేగించడం కలకలం రేపింది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల సమక్షంలో పోలీసులు ఒక వ్యక్తిని ఇలా అవమానించడం చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని, ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో జమ్మూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ అమానుష ఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్మూ పోలీసు సీనియర్‌ సూపరింటెండెంట్‌ వెల్లడించారు. బాధ్యులైన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

అయితే, నిందితుడు ఇటీవలే పట్టుబడిన ఓ పేరుమోసిన ముఠాలో సభ్యుడని, అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 
Jammu Kashmir
Jammu Kashmir Police
police brutality
theft suspect
human rights violation
police investigation
crime
social media
viral video
India

More Telugu News