Chandrababu Naidu: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీలో నైపుణ్య శిక్షణ: సీఎం చంద్రబాబు

Chandrababu Focuses on Skills Training for 20 Lakh Jobs in AP
  • 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా పనిచేయాలన్న సీఎం చంద్రబాబు
  • ‘నైపుణ్యం’ పోర్టల్‌లో సమగ్ర సమాచారం అనుసంధానం చేయాలన్న సీఎం
  • రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణకు ఆదేశాలు
రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి రాష్ట్ర, దేశ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని నైపుణ్య పోర్టల్‌లో పొందుపరచాలని ఆదేశించారు.

యువతను కూడా నైపుణ్య పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం ఎప్పటికప్పుడు వారికి చేరేలా చూడాలని అన్నారు. యువత వివరాలు నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా వారి రెజ్యూమ్ రూపొందేలా పోర్టల్‌ను రూపొందించాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని, వీటి ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు పొందేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐటీ కోర్సులు చేసిన విద్యార్థుల నైపుణ్యాలను కూడా అంచనా వేయాలని సూచించారు. తద్వారా ఆయా సంస్థల అవసరాలు గుర్తించి నైపుణ్యం కలిగిన మానవ వనరులను వెంటనే అందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. నైపుణ్యాలను గుర్తించి ముందుగానే వారిని సిద్ధం చేయడం వల్ల ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తాయని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1,164 జాబ్ మేళాలు నిర్వహించగా, ఇప్పటివరకు 61,991 మందికి ఉద్యోగాలు లభించినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ప్లేస్‌మెంట్లు వచ్చాయని తెలిపారు.

నైపుణ్య పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు, శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్లతో పాటు పరిశ్రమలతో అనుసంధానం, విదేశీ భాషల్లో శిక్షణ వంటి వివరాలు పొందుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, ఈ ఏడాదిలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1,500 ఉద్యోగాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని పరిశ్రమలూ అప్రెంటీస్‌షిప్ విధానాన్ని అమలు చేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Skills training
Job creation
Nara Lokesh
AP Skill Development
Employment opportunities
Artificial Intelligence
Job melas
Investments AP

More Telugu News