Donald Trump: ఇరాన్‌లో నాయకత్వ మార్పిడి కోరుకోవడం లేదు.. యూటర్న్ తీసుకున్న డొనాల్డ్ ట్రంప్

Donald Trump Says He Does Not Seek Leadership Change in Iran
  • గతంలో ఇరాన్ పాలన మార్పును సూచిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు
  • పాలన మార్పుతో గందరగోళం తప్పదని తాజాగా మాట మార్పు
  • ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అమల్లో ఉందన్న ట్రంప్
  • అయినప్పటికీ కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు
  • ఇజ్రాయెల్, ఇరాన్ సంయమనం పాటించాలని అధ్యక్షుడి సూచన
ఇరాన్‌లో నాయకత్వ మార్పిడిని తాను కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఆ దేశానికి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలన మార్పు గందరగోళానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఇరాన్‌లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు ఇటీవల సంకేతాలు ఇచ్చిన ట్రంప్ తాజాగా మాట మార్చారు.

నెదర్లాండ్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు వెళుతున్న ట్రంప్‌ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇరాన్‌లో నాయకత్వ మార్పును కోరుకోవడం లేదన్నారు. పాలన మార్పు అనేది గందరగోళాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. తాము అంత గందరగోళాన్ని చూడాలనుకోవడం లేదని వివరించారు. 
 
ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్‌లో పాలనా పరమైన మార్పు గురించి రాసుకొచ్చారు. నాయకత్వ మార్పు అనే పదాన్ని వాడటం రాజకీయంగా సరైనది కాకపోవచ్చని కానీ, ప్రస్తుత ఇరాన్ పాలన 'ఇరాన్‌ను మళ్లీ గొప్పగా మార్చలేకపోతే' అక్కడ నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. కానీ, ఆయన ప్రస్తుత వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. 

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్ లక్ష్యం పాలన మార్పు కాదని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు.  
Donald Trump
Iran
United States
Israel
leadership change
nuclear program
Middle East tensions
NATO summit
Pete Hegseth
JD Vance

More Telugu News