Harish Rao: రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా?: రేవంత్ కు హరీశ్ ప్రశ్న

Harish Rao Questions Revanth Reddy on KCR Comments
  • గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమంటూ హరీశ్ సవాల్
  • కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలు సంస్కారహీనమన్న హరీశ్
  • గెలుపుపై భరోసా లేకే రైతు భరోసా అంటున్నారని ఆరోపణ
రైతు భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని, తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపిస్తానని 'ఎక్స్' వేదికగా సవాల్ విసిరారు.

ప్రభుత్వ కార్యక్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని మరోసారి ప్రదర్శించారని హరీశ్‌రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలోని అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై భరోసా లేకనే విధిలేని పరిస్థితుల్లో రైతుభరోసా వేస్తున్నారని, లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం ప్రపంచం నవ్విపోతోందని పేర్కొన్నారు.

మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయలేని దద్దమ్మ ఇప్పుడు అన్నారం, సుందిళ్ల కూడా కూలాయని అంటున్నారని, అది నోరా మోరా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దమ్ముంటే, ఇసుమంతైనా నిజాయితీ ఉంటే 30 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇచ్చి మాట్లాడాలని, సన్న వడ్లకు రూ.1,200 కోట్ల బోనస్ బకాయిలు రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు.

హామీలపై ప్రశ్నిస్తున్నందుకే తమపై బూతులతో చెలరేగుతున్నారని, అయినా తాము సంయమనం కోల్పోబోమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు అబద్ధాల పుట్టను బద్దలు కొడుతూనే ఉంటామని హెచ్చరించారు. "గెలిచిన వాడు రాజు, ఓడిపోయిన వాడు రావణాసురుడు" అని సీఎం అంటున్నారని, మరి రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా అని నిలదీశారు. 
Harish Rao
Revanth Reddy
Telangana
KCR
Rythu Bharosa
Congress
Kaleshwaram Project
Godavari Banakacherla Project
Rahul Gandhi
Telangana Politics

More Telugu News