Sugavasi Balasubramanyam: నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ కీలక నేత

Sugavasi Balasubramanyam to Join YSRCP in Presence of Jagan
  • వైసీపీలో చేరనున్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం
  • ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పని చేసిన సుగవాసి
  • ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన వైనం
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన ఇప్పటికే రాయచోటి నుంచి విజయవాడకు బయలుదేరారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రాజుకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి ఇటీవలి పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని బాలసుబ్రమణ్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా, తన తండ్రి, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు మరణించినప్పుడు టీడీపీ తరఫున కనీసం ఒక్కరు కూడా అంత్యక్రియలకు హాజరుకాకపోవడం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.

సుగవాసి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. బాలసుబ్రమణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ, ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, జడ్పీటీసీ సభ్యుడిగా పలుమార్లు సేవలందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న బాలసుబ్రమణ్యం చేరికతో వైసీపీకి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
Sugavasi Balasubramanyam
YS Jagan
YSRCP
TDP
Andhra Pradesh Politics
Kadapa District
Rayachoti
Jagan Mohan Raju
Rajampet
Telugu Desam Party

More Telugu News