Chandrababu Naidu: బనకచర్లపై బాబు కీలక సూచన

                                                                                                         3          200
  • పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఏపీ కేబినెట్ సుదీర్ఘ చర్చ
  • తెలంగాణలోని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం సృష్టిస్తున్నాయన్న పలువురు మంత్రులు
  • తెలంగాణతో ఘర్షణాత్మక వైఖరికి వెళ్లకుండా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామన్న సీఎం చంద్రబాబు
  • మీడియాతో మాట్లాడే సమయంలో మంత్రులు సంయమనం పాటించాలని సూచించిన సీఎం  
పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుపై విస్తృత చర్చ జరిగింది. గత పదేళ్లలో తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, వాటిలో కొన్నింటికి అనుమతులు లేకున్నా తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమావేశంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు ఇచ్చిందని, అదేవిధంగా గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కూడా అనుమతి లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ ప్రాజెక్టు వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకపోయినా, తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇది సున్నితమైన అంశం కాబట్టి, తెలంగాణతో ఘర్షణాత్మక వైఖరిని విడనాడి చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనకరమని, కేవలం సముద్రంలోకి వృథాగా పోయే జలాలను మాత్రమే వినియోగించుకుంటున్నందున ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పునరుద్ఘాటించారు.

గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చెరో 200 టీఎంసీల నీటిని వాడుకున్నా ఎటువంటి సమస్య ఉండదన్నారు. ఇది మన హక్కు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందు గట్టిగా వాదనలు వినిపించాలని ఆయన అన్నారు. ఉద్రిక్తతలు, వివాదాలకు తావు లేకుండా సమస్యను పరిష్కరించుకుందామని, ఈ ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. 
Chandrababu Naidu
Polavaram project
Banakacherla project
Andhra Pradesh
Telangana
irrigation projects
Godavari River
water resources
CWC approval
interstate relations

More Telugu News