Kritika: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు.. కిందకి దిగిన మహిళను వేగంగా ఢీ కొట్టిన బొలెరో.. వీడియో ఇదిగో!

Hyderabad Kukatpally Accident CCTV Footage Reveals Shocking Details
  • కూకట్ పల్లిలో ఘోరం.. ప్రమాదమేనా, పకడ్బందీగా చేసిన హత్యా?
  • గుడికి వెళ్లి వస్తుండగా మహిళను చిదిమేసిన వాహనం
  • వేగంగా వచ్చి ఢీకొట్టి పారిపోయిన బొలెరో.. మహిళ అక్కడికక్కడే మృతి
కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా కారు మొరాయించడంతో కిందకు దిగి సాయం కోసం చూస్తున్న మహిళను ఓ బొలెరో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిపడ్డ బాధితురాలు అక్కడికక్కడే మరణించింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన తీరును గమనించిన పోలీసులు.. అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. సిటీకి చెందిన కృతిక అనే మహిళ తన భర్త అమిత్ కరణ్, కుమారుడు మాధవ్అ, అత్తమామలతో కలిసి ఆదివారం గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో వారి కారు మొరాయించింది. దీంతో కృతిక కారు దిగి కారు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ బొలెరో అకస్మాత్తుగా పక్కకు దూసుకొచ్చి కృతికను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కృతిక గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కన పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో వాహనం ఆగకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం రోడ్డు ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యనా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న బొలెరో వాహనాన్ని, దాని డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Kritika
Hyderabad road accident
Kukatpally accident
Hit and run case
Bolero accident
Road accident death
CCTV footage
Police investigation
Telangana news
Crime news

More Telugu News