Leopard attack: సింగిల్ హ్యాండ్ తో చిరుతను ఎదుర్కున్న యువకుడు.. వీడియో ఇదిగో!

Brave Man fights off leopard attack at brick kiln
  • యూపీలోని లఖింపూర్ ఖేరిలో ఇటుక బట్టీలో చిరుత దాడి
  • భయంతో పరుగులు తీసిన కార్మికులు
  • ప్రాణం కాపాడుకోవడానికి చిరుతతో పోరాడిన మిహిలాల్
  • దాడిలో పలువురికి గాయాలు.. ఆసుపత్రికి తరలించి చికిత్స  అందిస్తున్న అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటుక బట్టి కార్మికులపై చిరుతపులి దాడి చేసింది. దీంతో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చిరుత పులికి చిక్కిన ఓ యువకుడు మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి వీరోచిత పోరాటం చేశాడు. చిరుతను గాయపరిచి తప్పించుకున్నాడు. యువకుడి పోరాటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. లఖింపూర్ ఖేరి జిల్లా ధౌర్‌పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జుగ్నుపూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇటుక తయారీ కేంద్రంలో చిరుతపులి సంచరించింది. ఆ సమయంలో 35 ఏళ్ల మిహిలాల్ అనే కార్మికుడు అసాధారణ ధైర్యం ప్రదర్శించాడు. ప్రాణాలకు తెగించి చిరుతపులితో హోరాహోరీగా పోరాడాడు. చిరుతను కిందపడేసి, దాని నోటిని గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశాడు.

మిహిలాల్ చిరుతతో తలపడడం గమనించిన తోటి కార్మికులు, సమీపంలోని గ్రామస్థులు వెంటనే స్పందించారు. ఇటుకలు, రాళ్లతో చిరుతపులిపై దాడి చేశారు. అందరి ప్రతిఘటనతో చిరుతపులి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. చిరుతపులికి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. అనంతరం చిరుతపులిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.

చిరుతపులి దాడిలో మిహిలాల్‌తో పాటు మరికొందరు కార్మికులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీప అటవీ ప్రాంతంలో నుంచి చిరుతపులి దారి తప్పి జనవాసాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Leopard attack
Brick kiln worker
Mihilal
Lakhimpur Kheri
Uttar Pradesh
Forest department
Wildlife
India news
Viral video

More Telugu News