Pawan Kalyan: ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం, రాజ్యాంగ ద్రోహం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan calls Emergency a dark chapter and constitutional betrayal
  • ఎమర్జెన్సీ భారత చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయమన్న పవన్ 
  • నాటి కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దాహానికి నిదర్శనమని విమర్శ
  • రాజ్యాంగానికి ద్రోహం, ప్రజాస్వామ్యానికి అపహాస్యం జరిగిందని వ్యాఖ్య
  • ఈ దినాన్ని 'సంవిధాన్ హత్య దివస్'గా పాటిస్తున్నట్లు వెల్లడి
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. ఇది కేవలం రాజకీయ ఘటన మాత్రమే కాదని, రాజ్యాంగానికి జరిగిన ఘోర ద్రోహమని ఆయ‌న పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమేనని, నాటి కాంగ్రెస్ నాయకత్వపు అధికార దాహానికి నిదర్శనమని జ‌న‌సేనాని తీవ్రంగా విమర్శించారు.

ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ 'ఎక్స్‌' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) ద్వారా స్పందించారు. "పత్రికల గొంతు నొక్కేశారు. ప్రతిపక్షాల స్వరం అణచివేశారు. ప్రాథమిక హక్కులను కాలరాశారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, మొరార్జీ దేశాయ్ వంటి ఎందరో మహానాయకులను ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడినందుకు జైళ్లలో నిర్బంధించారు" అని పవన్ క‌ల్యాణ్ గుర్తుచేశారు.

"ఈ రాజ్యాంగ ద్రోహానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడి మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను స్మరించుకుంటూ 'సంవిధాన్ హత్య దివస్' పాటిస్తున్నాం. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడిన నాయకుల త్యాగాలను, గొంతులు నొక్కేయబడిన లక్షలాది మంది ఆవేదనను మనం గుర్తుంచుకోవాలి. రాజకీయాల పేరుతో మన రాజ్యాంగంతో రాజీపడే ఏ ప్రయత్నాన్నైనా ఈ రోజు కూడా మనం అప్రమత్తంగా ఎదుర్కోవాలి" అని పవన్ కల్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Pawan Kalyan
Emergency India
Indian Emergency
Janasena
Savidhan Hatya Divas
Loknayak Jayaprakash Narayan
Atal Bihari Vajpayee
LK Advani
George Fernandes
Morarji Desai

More Telugu News