Manchu Vishnu: అమితాబ్‌ బచ్చన్‌ను డైరెక్ట్ చేయాలన్నది నా కల: మంచు విష్ణు

Manchu Vishnu Dreams of Directing Amitabh Bachchan
  • 'కన్నప్ప' సినిమా ప్రచారంలో భాగంగా తన కోరికను వెల్లడించిన విష్ణు
  • 'కల్కి'లో అమితాబ్ నటన అద్భుతమంటూ ప్రశంస
  • ఈనెల‌ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కన్నప్ప'
  • సినిమాకు సెన్సార్ బోర్డు 12 కట్స్ తో యూ/ఏ స‌ర్టిఫికేట్‌
నటుడు మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన, తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేయడం తన చిరకాల స్వప్నమని వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో, మీరు భవిష్యత్తులో దర్శకత్వం వైపు అడుగులేస్తారా? అన్న ప్రశ్నకు విష్ణు స్పందించారు. ‘‘ఒకవేళ నేను దర్శకత్వం చేపడితే, అమితాబ్ బచ్చన్ గారి సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాను. అది నా కల. యావత్ భారత్‌ ఆయన నటనను ఎంతగానో ఇష్టపడుతుంది. గతేడాది విడుదలైన ‘కల్కి’ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో ఆయన నటన అద్భుతంగా ఉంది. ఆ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది’’ అని తన మనసులోని మాటను తెలియజేశారు.

ఇక విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఈనెల‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. మొదట 195 నిమిషాల (3 గంటల 15 నిమిషాలు) నిడివితో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 12 కట్స్ సూచించింది. ఆ మార్పుల అనంతరం సినిమా రన్‌టైమ్ 182 నిమిషాలు (3 గంటల 2 నిమిషాలు)గా ఖరారైంది. అలాగే మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. 

ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మంచు విష్ణు తిన్నడు/కన్నప్ప పాత్రలో నటిస్తుండగా... ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, మోహన్‌బాబు కనిపించనున్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Manchu Vishnu
Kannappa Movie
Amitabh Bachchan
Telugu Cinema
Kalki 2898 AD
Prabhas
Mohanlal
Akshay Kumar
Kajal Aggarwal
Tollywood

More Telugu News