Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డికి ఇంటి భోజనం అవసరం లేదు... మేము మంచి భోజనం పెడుతున్నాం: జైలు సూపరింటెండెంట్

Chevireddy Does Not Need Home Food says Jail Superintendent
  • చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడులకు ఇంటి భోజనంపై ఏసీబీ కోర్టులో విచారణ
  • జైల్లో నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్న జైలు సూపరింటెండెంట్
  • తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన కోర్టు
విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం పలు కీలక పిటిషన్లపై విచారణ జరిగింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు తమకు ఇంటి భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ నిన్న కౌంటర్‌ దాఖలు చేస్తూ, ఖైదీలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఇంటి నుంచి భోజనం అవసరం లేదని కోర్టుకు వివరించారు.

ఈ సందర్భంగా, భోజనం ఎవరు తీసుకువస్తారో తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని చెవిరెడ్డి తరఫు న్యాయవాదిని న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశించారు. చెవిరెడ్డి పిటిషన్‌పై తదుపరి విచారణను నేటికి (బుధవారం), వెంకటేశ్‌ నాయుడు పిటిషన్‌పై విచారణను రేపటికి (గురువారం) వాయిదా వేశారు. అదేవిధంగా, చెవిరెడ్డి, వెంకటేశ్‌ నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లు, వారిని కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను కూడా నేటికి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా, మద్యం కేసులో నిందితుడైన జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నిన్న మాజీ ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనల కోసం ఈ పిటిషన్‌పై విచారణను కూడా న్యాయాధికారి నేటికి వాయిదా వేశారు.
Chevireddy Bhaskar Reddy
Chevireddy
Vijayawada ACB Court
YSRCP
jail superintendent
Irfran Khan
home food
bail petition
Krishna Mohan Reddy
liquor case

More Telugu News