Shehbaz Sharif: భారత్‌తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

Shehbaz Sharif Ready for Talks with India
  • సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో టెలిఫోన్ సంభాషణ
  • వివిధ అంశాలపై చర్చించడానికి పాక్ సుముఖంగా ఉందన్న షరీఫ్
  • ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్థాన్‌తో చర్చలు ఉండవన్న భారత్
ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేంత వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం చర్చల అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని వివాదాలపై అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా మరోసారి ప్రకటించారు.

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ (ఎంబీఎస్)తో ఇటీవల జరిపిన టెలిఫోన్ సంభాషణలో షరీఫ్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు రేడియో పాకిస్థాన్ తెలిపింది. జమ్మూకశ్మీర్ సమస్య, ఉగ్రవాదం, వాణిజ్య సంబంధాలు, జలాల పంపిణీ వంటి కీలక అంశాలపై చర్చించడానికి పాకిస్థాన్ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది.

పశ్చిమాసియాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సౌదీ యువరాజు ఎంబీఎస్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఫోన్‌లో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను షరీఫ్ ప్రస్తావించారని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు సమాచారం.

గతంలో పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన అనంతరం, భారత సైన్యం పాకిస్థాన్‌పై సైనిక చర్య చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా, ఇరాన్, అజర్‌బైజాన్ వంటి దేశాలను సంప్రదించింది.

పాకిస్థాన్‌తో చర్చల అంశంపై స్పందించిన భారత్, సరిహద్దు ఆవలి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయే వరకు ఎలాంటి చర్చలు ఉండవని తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో కొనసాగడం అసాధ్యమని, నీరు, రక్తం కలిసి ప్రవహించలేవనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని భారత్ గట్టిగా హెచ్చరించింది.
Shehbaz Sharif
Pakistan
India
Jammu Kashmir
Terrorism
Saudi Arabia

More Telugu News