Shashi Tharoor: మాకు ఇండియా ఫస్ట్... కొందరికి మోదీ ఫస్ట్: శశిథరూర్ పై ఖర్గే ఫైర్

Kharge Fires at Shashi Tharoor Over Modi Praise
  • మోదీని పొగిడిన శశిథరూర్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు
  • ఆపరేషన్ సిందూర్‌పై థరూర్ ఆర్టికల్‌తో కాంగ్రెస్‌లో దుమారం
  • థరూర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమే, పార్టీవి కావన్న కాంగ్రెస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశంసించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. "మాకు దేశమే ప్రథమం, కానీ కొందరు వ్యక్తులకు మోదీయే ప్రథమం" అంటూ శశిథరూర్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం చేపట్టిన దౌత్యపరమైన చర్యలపై 'ది హిందూ' పత్రికలో శశిథరూర్ రాసిన వ్యాసం చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాసంలో, ప్రధానమంత్రి మోదీ శక్తి, చైతన్యం, ప్రపంచ వేదికపై నిమగ్నమవ్వాలనే ఆయన తపన భారతదేశానికి "ప్రధాన ఆస్తి"గా నిలుస్తోందని, అయితే దీనికి మరింత మద్దతు అవసరమని థరూర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురిచేయడమే కాకుండా... పార్టీ హైకమాండ్ కు, థరూర్‌కు మధ్య దూరాన్ని మరింత పెంచాయి. పార్టీ లైన్‌కు అనుగుణంగా థరూర్ మాట్లాడకపోవడంపై హైకమాండ్ అసంతృప్తితో ఉంది.

మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, "శశిథరూర్ ఇంగ్లిష్ చాలా ధారాళంగా మాట్లాడతారు. నాకు ఇంగ్లిష్ అంత బాగా రాదు. ఆయన భాష చాలా బాగుంటుంది. అందుకే ఆయన్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించాం" అని అన్నారు. 26 మంది అమాయకులు మరణించిన పహల్గామ్ దాడి తర్వాత, ప్రతిపక్షాలన్నీ సైన్యానికి అండగా నిలుస్తాయని చెప్పాయని ఖర్గే గుర్తుచేశారు. "దేశం ముందు, పార్టీ తర్వాత అన్నాం. కానీ కొందరు వ్యక్తులు 'మోదీ ముందు, దేశం తర్వాత' అని భావిస్తున్నారు. మేమేం చేయగలం?" అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ, తాను రాసిన వ్యాసాన్ని తాను బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నంగా చూడరాదని, అది జాతీయ ఐక్యత, దేశ ప్రయోజనాలు, భారతదేశానికి అండగా నిలవడమనే ఉద్దేశంతో చేసిందని స్పష్టం చేశారు.
Shashi Tharoor
Mallikarjun Kharge
Narendra Modi
Congress Party
India First
Politics
Diplomacy
Operation Sindoor
BJP

More Telugu News