Nara Lokesh: మనపై బాధ్యత ఉంచారు, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి: మంత్రి లోకేశ్

Nara Lokesh Focus on Responsibility and Public Service
  • ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి లోకేశ్ పిలుపు
  • మచిలీపట్నం గెలుపు రాష్ట్రవ్యాప్త విజయానికి నాంది అని వ్యాఖ్య
  • గత ప్రభుత్వ వేధింపులను గుర్తుచేస్తూ, పార్టీ కార్యకర్తల త్యాగాలకు వందనం
  • ఈ ఏడాదే నిరుద్యోగ భృతి, 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన
  • జూలై 2 నుంచి 'సుపరిపాలనలో-తొలి అడుగు' ఇంటింటి ప్రచారం
  • వైసీపీ నేతలు ఇంకా అహంకారంతోనే ఉన్నారని విమర్శ
రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో గొప్ప బాధ్యతను అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ అని, ఇక్కడ గెలిచినప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం ఖాయమైందని ఆయన అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మంత్రి కొల్లు రవీంద్రపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఆయన పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ధైర్యంగా నిలబడ్డారని లోకేశ్ ప్రశంసించారు. అదేవిధంగా, మచిలీపట్నంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునూ అందుకుని, కార్యక్రమాలను విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన తాను, ముందుగా కార్యకర్తలతో సమావేశం కావడానికే ప్రాధాన్యత ఇచ్చానని, ఇకపై నాయకులందరూ నియోజకవర్గ పర్యటనల్లో తొలుత కార్యకర్తలతో సమావేశం కావాలని సూచించారు.

గత కష్టాలను మరువొద్దు, అహంకారం తగదు

ఈ రోజు తాను మచిలీపట్నం వస్తుంటే దారిపొడవునా పోలీసులు పహారా కాస్తున్నారని, గతంలో మనపై అక్రమ కేసులు బనాయించిన వారే ఇప్పుడు సెల్యూట్ కొడుతున్నారంటే అది ప్రజాస్వామ్యం గొప్పతనమని లోకేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడిది సాధారణమైన మొండి ధైర్యం కాదని, 1996లో రాజమండ్రి సెంట్రల్ జైలును ఆధునీకరించిన ఆయన్నే, 2014-19 మధ్య ఆయన కట్టించిన బ్లాక్‌లోనే అక్రమంగా నిర్బంధించారని గుర్తుచేశారు. జైలు నుంచి చంద్రబాబు పులిలా బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు.

అధికారంలో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారని, అయితే పార్టీ నాయకులు కష్టకాలాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదని హితవు పలికారు. పార్టీ కోసం కంటిచూపు కోల్పోయిన చెన్నుపాటి గాంధీ, మంజులారెడ్డి, అంజిరెడ్డి తాత, తోట చంద్రయ్య వంటి వారి త్యాగాలే మనకు ఆదర్శమని పేర్కొన్నారు. "అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా వ్యవహరించాలి. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. అంతర్గతంగా పోరాడాలి. జగన్ రెడ్డిపై కంటే మూడు రెట్లు ఎక్కువగా పార్టీలో పోరాడాను. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడి ఉండాలి" అని లోకేశ్ స్పష్టం చేశారు.

సంక్షేమం, అభివృద్ధి మన అజెండా

దేశంలో ఏ పార్టీకీ సాధ్యంకాని విధంగా 94 శాతం సీట్లను కూటమి కైవసం చేసుకుందని లోకేశ్ తెలిపారు. ప్రజలకు మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని, పెద్దఎత్తున కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది నుంచే నిరుద్యోగ భృతిని కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలను గౌరవించాలనేది టీడీపీ నినాదమని, అది మన ఇంట్లోనే మొదలుకావాలని సూచించారు. 50 శాతం పనులు మగవారు, 50 శాతం పనులు ఆడవారు చేయాలనే అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చామన్నారు.

జులై 5న జరిగే మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్‌లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని, ఇప్పటివరకు 2 కోట్ల సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సిడీ మొత్తాన్ని మహిళల ఖాతాల్లో జమచేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పింఛను రూ.4 వేలు, దివ్యాంగుల పింఛను రూ.6 వేలు, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15 వేల పింఛను అందిస్తున్నామని వివరించారు.

జూలై 2 నుంచి 'సుపరిపాలనలో-తొలి అడుగు'

కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను జులై 2 నుంచి 'సుపరిపాలనలో-తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని లోకేష్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.

వైసీపీ నేతల తీరు మారలేదు

వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారపూరితంగానే మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి ఇప్పటికీ ప్రజలను, కార్యకర్తలను కలవడం లేదని లోకేశ్ విమర్శించారు. "రెడ్ బుక్ పేరు చెబితేనే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరికి బాత్‌రూమ్‌లో జారి చేయి విరిగింది. మేం చట్టప్రకారం ముందుకు వెళ్తున్నాం," అని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అహంకారానికి పోకుండా, సౌమ్యంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. "ప్రజలు మనపై బాధ్యత పెట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. కష్టపడి ప్రజల సమస్యలను పరిష్కరించాలి" అని ఉద్ఘాటించారు.

డబుల్ ఇంజన్ సర్కార్‌తో ప్రగతి

ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని లోకేశ్ తెలిపారు. ఏపీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్నారన్నారు.

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో 3 లక్షల మందితో యోగాసనాలు వేయించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించి, మోదీకి కానుకగా అందించామని గుర్తుచేశారు. కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయని, కూటమిని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పార్టీ అనేవి జోడెద్దుల బండి వంటివని, రెండింటినీ సమన్వయంతో నడిపేందుకు కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో కార్యకర్తలను గౌరవిస్తామని స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh
TDP
Telugu Desam Party
Chandrababu Naidu
Machilipatnam

More Telugu News