Donald Trump: జోహ్రాన్ మమ్దానీ ఒక‌ కమ్యూనిస్ట్ ఉన్మాది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump Calls Zohran Mamdani Communist Madman
  • న్యూయార్క్ మేయర్ డెమొక్రాటిక్ ప్రైమరీలో భారత సంతతి జోహ్రాన్ మమ్దానీ గెలుపు
  • మమ్దానీని 100 శాతం కమ్యూనిస్ట్ ఉన్మాది అంటూ ట్రంప్ తీవ్ర విమర్శ
  • మమ్దానీకి మద్దతిస్తున్న ఏఓసీ, చక్ షుమర్‌లపైనా ట్రంప్ ఫైర్
  • ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే ఈ జోహ్రాన్ మమ్దానీ
  • గెలిస్తే న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా మమ్దానీ రికార్డు
అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరుగుతున్న డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీని 100 శాతం కమ్యూనిస్ట్ ఉన్మాది అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయనకు మద్దతు ఇస్తున్న ప్రోగ్రెసివ్ నేతలపైనా ఘాటైన విమర్శలు చేశారు. 

న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఎన్నుకునే ప్రైమరీ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ గెలుపొందారు. ఈ పరిణామంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో స్పందించారు. "చివరకు ఇది జరిగింది. డెమొక్రాట్లు హద్దు దాటారు. 100 శాతం కమ్యూనిస్ట్ ఉన్మాది అయిన జోహ్రాన్ మమ్దానీ డెమ్ ప్రైమరీలో గెలిచి మేయర్ పోరుకు సిద్ధ‌మ‌య్యారు. గతంలోనూ మనకు రాడికల్ వామపక్షవాదులు ఉన్నారు. కానీ ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.

తాను సోషలిస్టునని ప్రకటించుకున్న మమ్దానీపై ట్రంప్ వ్యక్తిగత దాడులకు దిగారు. "అతను చూడటానికి భయంకరంగా ఉంటాడు. అతని గొంతు కర్ణకఠోరంగా ఉంటుంది. అంత తెలివైనవాడు కాదు. ఏఓసీ ప్లస్ 3 (అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, ఇతర ముగ్గురు సభ్యులు), అందరూ మూర్ఖులే. అతనికి మద్దతు ఇస్తున్నారు. మన గొప్ప పాలస్తీనియన్ సెనేటర్, ఏడుపుగొట్టు చక్ షుమర్ కూడా అతని కాళ్ల దగ్గర పడి ఉంటున్నాడు. అవును, ఇది మన దేశ చరిత్రలో ఒక పెద్ద ఘట్టం!" అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరొక పోస్టులో డెమొక్రాట్లు మళ్లీ పుంజుకోవాలంటే "తక్కువ తెలివితేటలున్న అభ్యర్థి జాస్మిన్ క్రాకెట్‌ను అధ్యక్ష పదవికి నామినేట్ చేయాలి" అని ట్రంప్ వ్యంగ్యంగా అన్నారు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, ఇతర ప్రొగ్రెసివ్ స్క్వాడ్ సభ్యులను ఉద్దేశించి ఏఓసీ ప్లస్ 3కి కేబినెట్ పదవులు ఇవ్వాలని కూడా ఆయన పేర్కొన్నారు.

భారత సంతతికి చెందిన ముస్లిం అయిన జోహ్రాన్ మమ్దానీ, ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ సినీ దర్శకురాలు మీరా నాయర్, భారతీయ మూలాలున్న ఉగాండా మార్క్సిస్ట్ విద్యావేత్త మహమూద్ మమ్దానీల కుమారుడు. న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో మేయర్ ప్రైమరీ ఎన్నికల నుంచి వైదొలగడంతో మమ్దానీ విజయం సాధించారు. ఇప్పటివరకు లెక్కించిన 90 శాతం ఓట్లలో మమ్దానీకి 43.5 శాతం ఓట్లు లభించాయి. ఒకవేళ తుది ఎన్నికల్లో మమ్దానీ గెలిస్తే, న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టిస్తారు.
Donald Trump
Zohran Mamdani
New York Mayor
Democratic Primary
Communist Madman
Alexandria Ocasio-Cortez
Chuck Schumer
Meera Nair
US Politics
Indian American

More Telugu News