Prithvi Shaw: అవే నా కెరీర్‌ను నాశ‌నం చేశాయి.. పృథ్వీషా ఆవేదన

Prithvi Shaw Reveals Career Struggles and Regrets
  • తప్పుడు స్నేహాలే దెబ్బతీశాయన్న పృథ్వీ షా
  • ఆట కంటే ఇతర విషయాలకే ప్రాధాన్యత ఇచ్చానంటూ ఆవేదన
  • తాతయ్య మరణంతో మానసికంగా కుంగిపోయానన్న యువ క్రికెటర్
  • కష్ట సమయాల్లో తండ్రి అండగా నిలిచారని వెల్లడి
  • ముంబై రంజీ జట్టుకు గుడ్‌బై.. కొత్త జట్టులోకి వెళ్లే అవకాశం
ఒకప్పుడు భారత క్రికెట్‌లో సంచలనంగా దూసుకొచ్చి, భవిష్యత్ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న యువ ఆటగాడు పృథ్వీ షా, ప్రస్తుతం తన కెరీర్‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పేలవమైన ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా తన కెరీర్ పతనం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు, చెడు స్నేహాల వల్లే ఈ దుస్థితికి కారణమని అంగీకరించాడు.

తప్పుడు నిర్ణయాలు.. తప్పుడు వ్యక్తులతో స్నేహం
తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందులు, ఆటపై దృష్టి సారించకపోవడానికి గల కారణాలను పృథ్వీ షా ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. "జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. క్రికెట్‌కు తగినంత సమయం కేటాయించడం లేదని నాకు అర్థమైంది. 2023 వరకు నేను రోజులో ఎక్కువ భాగం మైదానంలోనే గడిపేవాడిని. 

కానీ, ఆ తర్వాత కొన్ని అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాను. కొంతమంది తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. మనం మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు చాలా మంది స్నేహితులుగా దగ్గరవుతారు. నా విషయంలోనూ అదే జరిగింది. దీనివల్ల నేను దారి తప్పాను. మైదానంలో గడిపే సమయాన్ని 8 గంటల నుంచి 4 గంటలకు తగ్గించేశాను" అని పృథ్వీ షా ఆవేదన వ్యక్తం చేశాడు.

వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలు
వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు కూడా తన ఆటపై ప్రభావం చూపాయని షా తెలిపాడు. "నాకు కొన్ని కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. నాకు అత్యంత ఇష్టమైన మా తాతయ్య చనిపోయారు. ఆయన మరణంతో మానసికంగా కుంగిపోయాను. ఆ తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. నా తప్పులను నేను అంగీకరిస్తున్నాను. ఆ సమయంలో మా నాన్న నాకు అండగా నిలిచారు. క్లిష్ట సమయాల్లో ధైర్యం చెప్పారు" అని పృథ్వీ షా వివరించాడు.

గత కొంతకాలంగా పృథ్వీ షా ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఫిట్‌నెస్ కోల్పోయి లావుగా మారడంతో గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అడపాదడపా రాణించినప్పటికీ, పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇటీవల ముంబై రంజీ జట్టును కూడా పృథ్వీ షా వీడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌ఓసీ కూడా తీసుకున్నాడు. త్వరలోనే మరో దేశవాళీ జట్టుకు మారనున్నట్లు సమాచారం.
Prithvi Shaw
Indian Cricket
Cricket Career
Fitness Issues
Form Issues
Ranji Trophy
Mumbai Cricket
IPL
Cricket News
Sports

More Telugu News