Donald Trump: భారత్-పాక్ యుద్ధం ఆపింది నేనే.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

Trump says he prevented India Pakistan nuclear war
  • భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పింది తానేనని ట్రంప్ ఉద్ఘాటన
  • భారత్ ఇప్పటికే పలుమార్లు ఖండించినా తగ్గని అమెరికా అధ్యక్షుడు
  • వాణిజ్యం ఆపేస్తానని బెదిరించడంతోనే యుద్ధం ఆగిందన్న ట్రంప్
  • అణుయుద్ధాన్ని కూడా నివారించగలిగానని వ్యాఖ్య
  • ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్
  • ఇప్పటికి 18 సార్లు ట్రంప్ ఇదే మాటన్నారన్న గుర్తు చేసిన పార్టీ
గత నెలలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లార్చడంలో తనదే కీలక పాత్ర అని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. భారత్ ఈ వాదనను ఇప్పటికే పలుమార్లు ఖండించినప్పటికీ ట్రంప్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. పైగా, ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించిన తర్వాతే వారు యుద్ధం ఆపారని, తద్వారా అణుయుద్ధాన్ని నివారించగలిగానని చెప్పుకొచ్చారు.

నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలతో పాటు ప్రపంచంలోని ఇటీవలి సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తూ, వాటన్నింటికంటే ముఖ్యమైన భారత్-పాకిస్థాన్ వివాదాన్ని కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా తాను ముగించగలిగానని చెప్పారు. ‘‘మీరు పోరాడుకుంటే మేం ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని చెప్పాను. పాకిస్థాన్ జనరల్ (అసిమ్ మునీర్) చాలా ఆకట్టుకున్నారు. ప్రధానమంత్రి మోదీ నాకు మంచి మిత్రుడు, ఆయన గొప్ప వ్యక్తి. వారిని నేను ఒప్పించగలిగాను. వారికి వాణిజ్య ఒప్పందం కావాలన్నారు. అందుకే మేం అణుయుద్ధాన్ని ఆపాం’’ అని ట్రంప్ వివరించారు.

గత వారం ట్రంప్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ నేతలు ‘చాలా తెలివైన వారని’, యుద్ధాన్ని కొనసాగించకూడదని వారే నిర్ణయించుకున్నారని చెప్పి, కాల్పుల విరమణ ఘనతను తనకు ఆపాదించుకోకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, ప్రస్తుత వ్యాఖ్యలు దానికి భిన్నంగా ఉన్నాయి.

మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శలు
ట్రంప్ తాజా వ్యాఖ్యలతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించింది. ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది 18వ సారని గుర్తుచేసింది. మే 10 నుంచి ఇప్పటివరకు ట్రంప్ ఇలా చెప్పడం ఇది 16వ సారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ వీడియో స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి ప్రధాని మోదీ భారత ప్రయోజనాలను ‘బలహీనపరిచారని’ ఆరోపించారు. ‘‘మోదీనికి కొద్దిగా పొగిడితే చాలు.. ఆయన భారత ప్రయోజనాలను దెబ్బతీస్తారు. చైనాకు క్లీన్‌చిట్‌లు ఇవ్వడం, అమెరికా బెదిరింపులకు లొంగిపోవడం వంటివి చేస్తారు’’ అని ఖేరా వ్యాఖ్యానించారు. 
Donald Trump
India Pakistan conflict
Narendra Modi
Asim Munir
India Pakistan war
Ceasefire agreement
Nuclear war
Trade deal
Congress party
Jairam Ramesh

More Telugu News