Donald Trump: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం? డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

Donald Trump Comments on Potential Israel Iran War
  • ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం రావొచ్చన్న ట్రంప్
  • ప్రస్తుతానికి రెండు దేశాలూ అలసిపోయాయని వ్యాఖ్య
  • వచ్చే వారమే ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతామన్న ట్రంప్
  • పశ్చిమాసియా శాంతిపై ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త అనుమానాలు
ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అందరూ భావించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం ముగిసిపోయిందంటూ కొన్ని పోస్టులు చేశారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశాంతతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఆ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం రావొచ్చనే అనుమానాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.

ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... "ఆ రెండు దేశాలతో (ఇజ్రాయెల్-ఇరాన్) నేను చర్చలు జరిపాను. అవి రెండూ ప్రస్తుతానికి అలిసిపోయాయి" అని తెలిపారు. అయితే, ఇదే సమయంలో భవిష్యత్తు పరిణామాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తారా? అంటే బహుశా ఏదో ఒకరోజు రావొచ్చు. త్వరలోనే మళ్లీ ప్రారంభం కావొచ్చు" అంటూ ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ పునరావృతమయ్యే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు.

అంతేగాక‌ ఇరాన్‌తో అణు ఒప్పందం విషయమై కూడా ట్రంప్ ప్రస్తావించారు. వచ్చే వారంలో ఇరాన్‌తో అణు చర్చలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవైపు శాంతి నెలకొందని వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకోవచ్చని ట్రంప్ చెప్పడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాలో ప్రస్తుతానికి కాస్త శాంతియుత వాతావరణం నెలకొన్నప్పటికీ, ట్రంప్ తాజా వ్యాఖ్యలతో భవిష్యత్తు పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Donald Trump
Israel Iran conflict
Iran Israel war
Middle East tensions
nuclear deal
US foreign policy
Iran nuclear talks
West Asia conflict
Israel
Iran

More Telugu News