AB Venkateswara Rao: బనకచర్ల ప్రాజెక్టుపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

AB Venkateswara Rao Comments on Banakacherla Project Concerns
  • బనకచర్లతో రాయలసీమలో కొత్తగా సాగయ్యే ఆయకట్టు ఉండదన్న ఏబీవీ 
  • ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా జలాల్లో 200 టీఎంసీలపై ఏపీ హక్కు కోల్పోతుందన్న ఏబీవీ 
  • లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజలు, మేధావులు, నిపుణులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉందన్న ఏబీవీ
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో కొత్తగా ఆయకట్టు పెరగకపోగా, రాష్ట్రం కృష్ణా జలాల్లో 200 టీఎంసీలపై హక్కు కోల్పోతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ముందుకు వెళ్లాలని భావిస్తున్న తరుణంలో, ఈ ప్రాజెక్టును ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాల నేతలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు.

ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బనకచర్ల ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలు కూడా కరువులోనే ఉండిపోతాయని అన్నారు. పట్టిసీమ కాలువను పెద్దది చేసి 38వేల క్యూసెక్కుల నీరు పంపినా, మరో సమాంతర కాలువ నిర్మించినా ప్రకాశం బ్యారేజీ వద్ద నది నిండుగా ప్రవహిస్తే విజయవాడకు వరద ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు.

18.5 కిలోమీటర్ల వెలిగొండ సొరంగం 30 ఏళ్ల నుంచి పాలకులు పూర్తి చేయలేకపోయారని గుర్తు చేస్తూ, ఇప్పుడు నల్లమల కొండల్లోంచి మూడేళ్లలో 26 కిలోమీటర్ల సొరంగం ఎలా తవ్వగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 1,225 అడుగుల ఎత్తుకు 23వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలని, బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి తిరిగి దాన్ని వాగులు, పెన్నా ద్వారా సోమశిలకు తీసుకువెళ్లడం విద్యుత్, ఇతర ఖర్చులను వృధా చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్టు గత, ప్రస్తుత ప్రభుత్వాలకు అనుకూలమైన కాంట్రాక్ట్ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోందని, అందుకే వైసీపీ కూడా ప్రశ్నించడం లేదని ఆయన ఆరోపించారు. లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజలు, మేధావులు, నిపుణులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 
AB Venkateswara Rao
Banakacherla project
Polavaram project
Andhra Pradesh
Rayalaseema irrigation
Krishna River
water resources
irrigation projects
AP politics
TDP government

More Telugu News