Harshakumar: హైకోర్టులో పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు .. రూ.5 లక్షలు జమకు మరింత గడువు కోరిన హర్షకుమార్

Harshakumar requests more time to deposit 5 lakhs in Pastor Praveen death case
  • పిల్ ఉపసంహరణకు అనుమతి కోరిన కేఎ పాల్ 
  • దర్యాప్తు వివరాలను ధర్మాసనం ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు
  • తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్ (పిల్)లపై నిన్న హైకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల మృతి ఘటనలో దర్యాప్తు వివరాలు న్యాయస్థానం ముందు ఉంచాలని పోలీసులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు దర్యాప్తులో ఏమైనా పొరపాట్లు జరిగాయా అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్ ప్రణతి స్పందిస్తూ.. దర్యాప్తులో ఎలాంటి తప్పులూ చోటుచేసుకోలేదని వివరించారు. దర్యాప్తు చివరి దశకు చేరిందని పేర్కొన్నారు.

మృతుడు ప్రవీణ్ దారిలో మూడు చోట్ల మద్యం కొనుగోలు చేశారని, ఆయన బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని చెప్పారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రవీణ్ మృతిపై వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం లేదని చెప్పారు.

కాగా, తన పిల్ ఉపసంహరణకు అనుమతించాలని, తాజాగా దాఖలు చేసుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలని కేఏ పాల్ హైకోర్టును కోరారు. ఈ అభ్యర్థనను తర్వాత పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు రూ.5 లక్షలు కోర్టులో జమ చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని హర్షకుమార్ తరపు న్యాయవాది అభ్యర్థించడంతో ధర్మాసనం అంగీకరించింది. విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. 
Harshakumar
Pastor Praveen Pagadala
Praveen Pagadala death case
Andhra Pradesh High Court
CBI investigation
KA Paul
Public Interest Litigation
Court hearing
Police investigation
Bank transactions

More Telugu News