Kannappa: 'క‌న్న‌ప్ప' చిత్రాన్ని వీక్షించిన బాలీవుడ్ ప్ర‌ముఖులు.. ముంబై టాక్ ఇదే!

Kannappa Movie Review Bollywood Reacts to Manchu Vishnu Film
  • విష్ణు 'కన్నప్ప' పై ముంబై నుంచి తొలి రిపోర్ట్స్
  • క్లైమాక్స్ 'కాంతార'ను గుర్తుచేసిందన్న విశ్లేషకులు
  • ప్రభాస్ 40 నిమిషాల పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్
  • విష్ణు నటన కెరీర్ బెస్ట్ అని ప్రశంసలు
  • ఆకట్టుకున్న మోహన్ లాల్ ఎపిసోడ్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప' మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ముంబైలో కొంతమంది సినీ ప్రముఖులు, విశ్లేషకుల కోసం 'కన్నప్ప' ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సమాచారం. సినిమా చూసిన వారి నుంచి ఆసక్తికరమైన స్పందనలు వెలువడుతున్నాయి.

విశ్లేషకుల మాటల్లో సినిమా ఎలా ఉందంటే?
సినిమా చూసిన కొందరు విశ్లేషకుల ప్రకారం 'కన్నప్ప' క్లైమాక్స్ సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, రిషబ్ శెట్టి 'కాంతార' క్లైమాక్స్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పరమశివుని భక్తులు సినిమా చూశాక గొప్ప భక్తిభావంతో బయటకు వస్తారని అంటున్నారు. పరమేశ్వరుని గొప్ప భక్తుడైన తిన్నడు (కన్నప్ప) కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఓ నాస్తికుడు అయిన తిన్నడు ఎలా పరమశివ భక్తుడిగా మారి 'కన్నప్ప' అయ్యాడనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించారని తెలుస్తోంది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు.

అయితే, సినిమా ప్రథమార్ధం కాస్త నెమ్మదిగా సాగుతుందని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రీ-ఇంటర్వెల్ వరకు కథనం నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. సినిమాలో మోహన్ లాల్ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ఇక, సుమారు 40 నిమిషాల నిడివిగల రుద్ర పాత్రలో కనిపించిన ప్రభాస్, తనదైన నటనతో సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

'కన్నప్ప' పాత్రలో మంచు విష్ణు అద్భుతంగా నటించారని, ఆ పాత్ర కోసమే ఆయన పుట్టినట్లుగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా విష్ణు నటన ఆకట్టుకుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లోని చివరి 15 నిమిషాల్లో విష్ణు తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని చెబుతున్నారు. పరమేశ్వరునిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని అంటున్నారు.

అయితే, ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం, కొన్నిచోట్ల నిర్మాణ విలువలు కాస్త తక్కువగా ఉన్నాయనిపించడం వంటివి మైనస్‌లుగా చెబుతున్నారు. ఏదేమైనా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకుల మాటలను బట్టి తెలుస్తోంది.
Kannappa
Manchu Vishnu
Kannappa Movie
Kannappa Film
Mohan Babu
Prabhas
Akshay Kumar
Kajal Aggarwal
Telugu Movie Review
Indian Mythology
Lord Shiva

More Telugu News