Ali Khamenei: పత్తా లేని ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా ఖమేనీ.. తీవ్ర సంక్షోభంలో దేశం!

Iran Supreme Leader Khamenei Disappearance Sparks Concern
  • వారం రోజులుగా అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ  
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఆందోళన
  • రహస్య బంకర్‌లో భద్రంగా ఉన్నారంటున్న అధికారులు
  • ఖమేనీ ఆచూకీపై ఇరాన్ మీడియాలోనూ మౌనం
  • ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, కొనసాగుతున్న ఊహాగానాలు
ఇరాన్ సైనిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో దేశ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ వారం రోజులుగా కనిపించకపోవడం మిస్టరీగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా దళాలు సంయుక్తంగా ఇరాన్‌లోని మూడు కీలక అణు స్థావరాలపై దాడులు చేయడం, ప్రతిగా టెహ్రాన్ ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులతో విరుచుకుపడటం వంటి తీవ్ర పరిణామాల మధ్య ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.

ఇజ్రాయెల్ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ మీడియా ఖమేనీకి సంబంధించిన ఎలాంటి చిత్రాలు గానీ, దృశ్యాలు గానీ ప్రసారం చేయలేదు. ఆయనకు అత్యంత సన్నిహితులైన అధికారులు మాత్రం ఖమేనీని ఒక రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని, హత్యాయత్నాల నుంచి రక్షణ పొందేందుకు ఆయన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. సుప్రీం లీడర్‌ను హతమార్చే అవకాశాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చలేదని, అయితే అలా చేయవద్దని ట్రంప్ సూచించినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది.

ఇరాన్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు కూడా ఖమేనీతో నేరుగా సంబంధాలు తెగిపోయాయని సమాచారం. మంగళవారం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రైమ్ టైమ్ షోలో ఖమేనీ కార్యాలయ సీనియర్ అధికారి మెహదీ ఫజాయెలీని యాంకర్.. సుప్రీం లీడర్ ఆచూకీ గురించి ప్రశ్నించారు. "సుప్రీం లీడర్ గురించి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో చెప్పగలరా?" అని యాంకర్ అడగ్గా.. ఫజాయెలీ ఆ ప్రశ్నను దాటవేస్తూ "మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్‌కు రక్షణ కల్పించే బాధ్యతలో ఉన్నవారు తమ పని తాము చేస్తున్నారు" అని తెలిపారు.

కాగా, ఖమేనీ కనిపించకపోవడంపై సొంత దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. "ఖమేనీ రోజుల తరబడి కనిపించకపోవడం ఆయన్ని ప్రేమించే మనందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది" అని ఖనేమాన్ అనే దినపత్రిక సంపాదకుడు మొహసెన్ ఖలీఫే అన్నారు. ఒకవేళ ఖమేనీ మరణిస్తే "ఆయన అంత్యక్రియలు అత్యంత వైభవంగా, చారిత్రాత్మకంగా జరుగుతాయి" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖమేనీ తన కుటుంబంతో కలిసి అజ్ఞాతంలో ఉన్నారని, రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన వలీ-యే అమర్ ప్రత్యేక దళాల విభాగం ఆయనకు రక్షణ కల్పిస్తోందని ఓ ఉన్నత భద్రతాధికారి ‘రాయిటర్స్‌’కు వెల్లడించారు.
Ali Khamenei
Iran
Ayatollah Khamenei
Israel
Iran Israel conflict
Benjamin Netanyahu
Donald Trump
Iran nuclear program
Middle East crisis
Khamenei missing

More Telugu News