Yashoda Gaikwad: చెత్తకుప్పలో వృద్ధురాలు.. తానే పారేశానన్న మనవడు!

Grandson dumps elderly woman Yashoda Gaikwad in Mumbai garbage
  • ముంబైలో వృద్ధురాలిని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు
  •  మనవడు సహా ముగ్గురిపై పోలీసుల కేసు నమోదు
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలతో బయటపడిన మనవడి అబద్ధం
  • చర్మ క్యాన్సర్, మానసిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధురాలు
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స, పలు సంస్థల నుంచి ఉచిత వైద్యానికి ఆఫర్లు
  • ఘటనపై మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ
ముంబైలోని ఆరే కాలనీలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కన్నపేగు బంధాన్ని మరిచి, మానవత్వాన్ని మంటగలిపి, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులే నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పలో పడేశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి పోలీసులు వృద్ధురాలి మనవడు సహా ముగ్గురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యశోద గైక్వాడ్ (60) అనే వృద్ధురాలు చర్మ క్యాన్సర్‌తో పాటు కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. గత శనివారం ఉదయం ఆరే కాలనీలోని దర్గా రోడ్డులో ఉన్న చెత్తకుప్పలో ఆమె అత్యంత దీనస్థితిలో, గాయాలతో బలహీనంగా పడి ఉండటాన్ని కొందరు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను జోగేశ్వరి ట్రామా కేర్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో తన మనవడు సాగర్ షెవాలే తనను ఇక్కడ వదిలేసి వెళ్లినట్టు యశోద తెలిపారు. అయితే, సాగర్ షెవాలేను విచారించగా.. ఆమె తనంత తానే ఇంటి నుంచి వెళ్లిపోయిందని మొదట కట్టుకథ అల్లాడు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా సీసీటీవీ ఫుటేజీలో అసలు విషయం బయటపడింది. సాగర్ షెవాలే చెప్పింది అబద్ధమని తేలింది.

అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి యశోద గైక్వాడ్ తీవ్ర ఆవేశానికి లోనై, తనను తాను గాయపరుచుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, మనవడు సాగర్ షెవాలేపై కూడా దాడికి యత్నించారు. దీంతో సాగర్, అతని మామ బాబాసాహెబ్ గైక్వాడ్ కలిసి ఆమెను ఆసుపత్రిలో చేర్పించడానికి ప్రయత్నించారు. అంబులెన్స్‌లో ఒక ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అక్కడ సేవలు అందుబాటులో లేవని చెప్పి అడ్మిషన్ నిరాకరించారు.

ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత సాగర్ షెవాలే, బాబాసాహెబ్ గైక్వాడ్ కలిసి సంజయ్ కుడ్షిమ్ అనే ఆటో రిక్షా డ్రైవర్ సహాయంతో తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు యశోద గైక్వాడ్‌ను చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లి అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆ తర్వాత విచారణలో సాగర్ అంగీకరించాడు. ఈ ఘటనపై పోలీసులు సాగర్ షెవాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యశోదకు ఉచిత వైద్యం
ప్రస్తుతం యశోద గైక్వాడ్ కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు అల్సరేటివ్ స్కిన్ గ్రోత్ (పుండుతో కూడిన చర్మపు పెరుగుదల) ఉందని, అది బహుశా బేసల్ సెల్ కార్సినోమా (ఒక రకమైన చర్మ క్యాన్సర్) అయి ఉండవచ్చని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూపర్ ఆసుపత్రి డీన్ డాక్టర్ సుధీర్ మేధేకర్ తెలిపారు. ఈ అమానుష ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి సమీక్ష చేపట్టింది. అలాగే, నాగ్‌పూర్‌లోని జాతీయ క్యాన్సర్ సంస్థ యశోద గైక్వాడ్‌కు ఉచితంగా చికిత్స అందిస్తామని ముందుకు వచ్చింది.
Yashoda Gaikwad
Mumbai
বৃদ্ধ woman abandoned
Aarey Colony
Sagar Shewale
crime news
skin cancer
Cooper Hospital
Maharashtra Human Rights Commission
National Cancer Institute Nagpur

More Telugu News