Shubhanshu Shukla: కోట్లాది భారతీయుల ఆశలు మోస్తున్నా.. అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్‌కాల్

Shubhanshu Shukla Live Call From Space Millions of Indians Hopes
  • అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
  • యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ప్రయాణం, నేడు ఐఎస్ఎస్‌కు
  • భూకక్ష్య నుంచి లైవ్‌కాల్‌లో మాట్లాడిన శుభాంశు
  • కోట్లాది భారతీయుల మద్దతే తన బలమన్న వ్యోమగామి
  • 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు
భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్‌ పైలట్‌, వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయానం విజయవంతంగా కొనసాగుతోంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆయన ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్నారు. నేటి సాయంత్రం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్షం నుంచి ఆయన లైవ్‌కాల్‌లో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం అద్భుతంగా ఉందని, భారరహిత స్థితిలో నడవడం వంటివి చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని ఆయన తెలిపారు.

భారత కాలమానం ప్రకారం నిన్న‌ మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లా సహా మొత్తం నలుగురు వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌక ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్‌తో అనుసంధానం కానుంది. ఈ బృందం అక్కడ 14 రోజుల పాటు ఉండి పలు కీలక పరిశోధనలు చేపట్టనుంది. దాదాపు 41 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

అంతరిక్షం నుంచి లైవ్‌కాల్‌లో శుభాంశు శుక్లా మాట్లాడుతూ... "అంతరిక్షం నుంచి అందరికీ నా నమస్కారాలు. తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక గొప్ప ప్రయాణం. 30 రోజుల క్వారంటైన్‌ అనంతరం ఇప్పుడు ఐఎస్ఎస్‌కు చేరుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. తమతో పాటు 'జాయ్' అనే ఒక బేబీ హంస బొమ్మను కూడా తీసుకెళ్తున్నామని, భారతీయ సంప్రదాయంలో హంస విజ్ఞానానికి ప్రతీక అని ఆయన వివరించారు.

దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ లైవ్‌కాల్‌లో శుభాంశు తన అనుభూతులను వివరిస్తూ... "భారరహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. అంతరిక్షంలో ఎలా నడవాలి? ఎలా ఆహారం తీసుకోవాలి? వంటి విషయాలను ఒక చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడ గడిపే ప్రతీ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై మన మువ్వన్నెల పతాకం ఉంది. అది చూసినప్పుడల్లా ఈ ప్రయాణంలో నేను ఒంటరిని కానని, కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే ధైర్యం కలుగుతుంది.

రోదసీయానంలో నాది ఒక చిన్న అడుగే కావచ్చు, కానీ భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఇది ఒక ఘనమైన ముందడుగు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, నా అనుభవాలను మీ అందరితో పంచుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని శుభాంశు శుక్లా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Shubhanshu Shukla
Indian Air Force
Astronaut
Axiom-4 mission
International Space Station
ISS
Space travel
Space exploration
NASA
Indian astronaut

More Telugu News