Prasad Babu: ఆ డైరెక్టర్ కి 'హాయ్' చెప్పి ఇబ్బందుల్లో పడ్డాను: నటుడు ప్రసాద్ బాబు!

Prasad Babu Interview
  • కృష్ణంరాజుతో నాకు చనువు ఎక్కువ
  • మధుసూదన్ రావు గారిని అప్పుడే చూడటం 
  • నా ప్రవర్తన కారణంగా ఆయన అహం దెబ్బతింది
  • అందువలనే ఐదు టేకులు తీసుకున్నానన్న ప్రసాద్ బాబు  
     
 నటుడిగా ప్రసాద్ బాబుకి మంచి పేరు ఉంది. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న ఆయన, సీరియల్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అలాంటి ప్రసాద్ బాబు, 'ఐడ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్లో జరిగిన అనేక సంఘటనల గురించి ప్రస్తావించారు. 'శివమెత్తిన సత్యం' సినిమాలో నేను ఒక ముఖ్యమైన పాత్రను చేశాను. ఆ సినిమాలో హీరోగా చేస్తున్న కృష్ణంరాజుగారితో నాకు మంచి చనువు ఉంది. కానీ దర్శకుడు వి. మధుసూదనరావుగారితో పరిచయం లేదు" అని అన్నారు. 

" నేను వెళ్లిన మొదటి రోజున సెట్లోకి అడుగుపెడుతూనే అందరికీ 'హాయ్' చెప్పాను. మేకప్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చాను. 'డైలాగ్ చూసుకున్నావా?' అని మధుసూదనరావుగారు అడిగారు. 'చూసుకున్నాను' అని చెప్పాను. దాంతో ఆయన ఓకే అన్నారు. నేను డైలాగ్ చెబుతూ ఉండగానే ఆయన 'కట్' చెప్పారు. 'డైలాగ్ చూసుకున్నావా?' అని మళ్లీ అడిగారు. 'ఏం సార్ .. బాగానే చెప్పానే' అన్నాను. 'ఏయ్ .. డైలాగ్ చూసుకో' అని సీరియస్ గా చెప్పారు. అప్పుడు ఏదో తేడా కొడుతుందే అనిపించింది. 

"ఐదు టేకులు అయ్యాయి .. ఓకే కావడం లేదు. నా వైపు నుంచి ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు అర్థం కాలేదు. దాంతో నేను ఆ పక్కనే ఉన్న కృష్ణంరాజు దగ్గరికి వెళ్లి పరిస్థితి చెప్పాను. అప్పుడు కృష్ణంరాజు చెప్పాడు, 'ఆయన చాలా పెద్ద డైరెక్టర్ .. ఆయనంటే అక్కినేనికి కూడా భయమే. అలాంటి  ఆయనకి సింపుల్ గా 'హాయ్' చెప్పేసి వెళ్లిపోతావా?' అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది .. నేను చేసిన తప్పు ఏమిటో. వెళ్లి వి. మధుసూదనరావుగారి కాళ్ల దగ్గర కూర్చున్నాను. డైలాగ్ ఎలా చెప్పాలో చెప్పండి అన్నాను. ఆ మాటకి ఆయన కూల్ అయ్యారు. ఆ వెంటనే షాట్ ఓకే చేశారు" అంటూ నవ్వేశారు. 

Prasad Babu
Sivametthina Satyam
V Madhusudana Rao
Krishnam Raju
Telugu actor
Telugu cinema
Movie director
Film industry
Akkineni
Tollywood

More Telugu News