US Visa: వీసా కావాలా?: సామాజిక మాధ్యమాలపై అమెరికా కొత్త నిబంధన

US Visa New Social Media Rules for US Visa Applications
  • అమెరికా వీసా దరఖాస్తులో సామాజిక మాధ్యమాల సమాచారం దాచొద్దు
  • వివరాలు దాస్తే వీసా దరఖాస్తు తిరస్కరణ, భవిష్యత్తులోనూ అవకాశం కష్టం
  • ఎఫ్, ఎం, జె వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ చేయాలి
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు కీలక సమాచారాన్ని గోప్యంగా ఉంచితే, వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని అమెరికా దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు సంబంధించిన వివరాల విషయంలో ఈ నిబంధనను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపింది.

ఒకసారి సమాచారం దాచి తిరస్కరణకు గురైతే, ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకున్నా వీసా లభించే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా దౌత్య కార్యాలయం 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా కోసం నింపే డీఎస్-160 దరఖాస్తు ఫారమ్‌లో దరఖాస్తుదారులు గత ఐదేళ్లుగా వినియోగిస్తున్న తమ సామాజిక మాధ్యమ 'యూజర్‌నేమ్‌లు', 'హ్యాండిల్స్‌'ను తప్పనిసరిగా వెల్లడించాలని ఆ పోస్టులో సూచించారు.

దరఖాస్తులో పొందుపరిచిన సమాచారం అంతా వాస్తవమైనదని, సరైనదేనని సంతకం చేయడానికి ముందే అభ్యర్థి ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, లింక్డ్‌ఇన్‌, ఎక్స్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర వేదికలపై ఉన్న ఐడీలను కూడా వీసా దరఖాస్తులో కచ్చితంగా తెలియజేయాలని ఆదేశించారు.

ఎఫ్, ఎం, జె నాన్-ఇమిగ్రెంట్ వీసాలకు కొత్త నిబంధనలు

అమెరికాకు చెందిన ఎఫ్, ఎం, జె కేటగిరీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా నిబంధనలలో మార్పులు చేశారు. స్టూడెంట్స్, ఎక్స్‌ఛేంజ్ విజిటర్స్ వంటి నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా తమ సామాజిక మాధ్యమ ఖాతాలను 'పబ్లిక్‌'గా ఉంచాలని ఆదేశించారు. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దీనితో దరఖాస్తుదారులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్‌ను 'పబ్లిక్'కు మార్చుకోవాలని సూచించారు. అమెరికా చట్టాల ప్రకారం సామాజిక మాధ్యమ వెట్టింగ్ తప్పనిసరి అని కూడా స్పష్టం చేశారు.

సాధారణంగా ఎఫ్, ఎం, జె వీసాలు నాన్-ఇమిగ్రెంట్ శ్రేణిలోకి వస్తాయి. విదేశీ విద్యార్థులు అమెరికాలోని విద్యాసంస్థలలో చదువుకోవడానికి ఎఫ్ వీసా, వృత్తి విద్యా కోర్సులు (ఒకేషనల్ స్టూడెంట్స్) అభ్యసించే వారికి ఎం వీసా జారీ చేస్తారు. ఇక జె వీసాను ఎక్స్‌ఛేంజ్ విజిటర్స్ ప్రోగ్రాములలో పాల్గొనేవారు, పరిశోధకులు (రీసెర్చర్లు), స్కాలర్లు, ఇంటర్న్‌షిప్ చేసేవారికి మంజూరు చేస్తారు.

అమెరికా అనుసరిస్తున్న కఠినమైన వీసా విధానాల నేపథ్యంలో, తాజాగా "సోషల్ మీడియా వెట్టింగ్" నిబంధన విదేశీ విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే విషయాన్ని అంచనా వేయడం కోసం అధికారులు వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నిశితంగా తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియనే 'సోషల్ మీడియా వెట్టింగ్' అంటారు.
US Visa
United States
Social Media
DS-160 Form
F Visa
M Visa
J Visa
Student Visa
Exchange Visitors
Visa Application

More Telugu News