Rajnath Singh: ఎస్సీఓ భేటీలో భారత్ సంచలనం: ఉమ్మడి ప్రకటనపై సంతకానికి రాజ్‌నాథ్ నిరాకరణ

Rajnath Singh Refuses to Sign SCO Joint Statement
  • చైనాలో ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో కీలక పరిణామం
  • ఉగ్రవాదంపై విభేదాలతో ఉమ్మడి ప్రకటనపై భారత్ సంతకానికి నిరాకరణ
  • కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని విధానంగా వాడుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ విమర్శ
  • పహల్గామ్ దాడిని ప్రస్తావించిన రక్షణ మంత్రి, పాక్‌కు పరోక్ష చురకలు
  • తీవ్ర భిన్నాభిప్రాయాలతో అసలు ఉమ్మడి ప్రకటన జారీనే చేయని ఎస్ సీఓ
  • చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ ద్వైపాక్షిక చర్చలు, సైనిక హాట్‌లైన్‌పై ప్రస్తావన
అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదం విషయంలో తన దృఢ వైఖరిని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ మరోసారి నిష్కర్షగా చాటుకుంది. చైనాలోని కింగ్‌డావో నగరంలో గురువారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రవాద నిర్మూలన, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై రూపొందించిన ఉమ్మడి ప్రకటనలోని కొన్ని ప్రతిపాదనలు భారత ప్రయోజనాలకు, వైఖరికి విరుద్ధంగా ఉండటంతో, దానిపై సంతకం చేయడానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. ఆ ప్రతిపాదనల పత్రాలను పరిశీలిస్తూ పెన్ను పక్కనపెట్టేశారు. ఈ నిర్ణయం, ఉగ్రవాదంపై, ప్రత్యేకించి సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ ఎంతటి కఠిన వైఖరిని అవలంబిస్తుందో ప్రపంచానికి స్పష్టం చేసింది.

సమావేశానంతరం విడుదల చేయాలని భావించిన ఉమ్మడి ప్రకటన ముసాయిదాలో, ఇటీవలే జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో, పాకిస్థాన్ పదేపదే ఆరోపిస్తున్న బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ కార్యకలాపాల గురించి పరోక్షంగా ప్రస్తావించే ప్రయత్నాలు జరిగాయని, దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందని సమాచారం. ఉగ్రవాద అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, చివరికి ఎస్ సీఓ ఎలాంటి ఉమ్మడి ప్రకటనను జారీ చేయకుండానే సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చైనా, రష్యా, పాకిస్థాన్‌తో పాటు ఎస్సీఓలోని పది సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు.

సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంలో భాగంగా మార్చుకుని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి శిక్షణనిస్తున్నాయని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ, ఇది పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దుశ్చర్యేనని ఆయన స్పష్టం చేశారు. "ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులను ఎస్ సీఓ సమష్టిగా నిలదీయాలి. శాంతి, శ్రేయస్సు అనేవి ఉగ్రవాదంతో కలిసి మనుగడ సాగించలేవు" అని ఆయన ఉద్ఘాటించారు. ఉగ్రవాద చర్యలు ఎక్కడ, ఎవరు, ఏ ఉద్దేశంతో చేసినా అవి నేరపూరితమైనవేనని, వాటిని సమర్థించరాదని ఆయన పిలుపునిచ్చారు.

ఈ చైనా పర్యటనలో భాగంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సైనిక హాట్‌లైన్‌ను పునరుద్ధరించడం సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గల్వాన్ ఘర్షణల అనంతరం భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
Rajnath Singh
SCO
Shanghai Cooperation Organisation
China
Defence Minister
Terrorism
Pahalgam attack
India
Pakistan
Balochistan

More Telugu News