Ali Khamenei: ఇజ్రాయెల్‌పై విజయం సాధించాం, అమెరికాను చిత్తు చేశాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Ali Khamenei Claims Iran Victory Over Israel and US
  • ఇజ్రాయెల్‌పై ఇరాన్ విజయం సాధించిందని ఖమేనీ ప్రకటన
  • 'మోసపూరిత జియోనిస్ట్ పాలన'ను చిత్తు చేశామని వ్యాఖ్య
  • అమెరికా జోక్యం చేసుకున్నా ఫలితం శూన్యమన్న ఇరాన్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ 'విజయం' సాధించిందని, అమెరికాను కూడా చావుదెబ్బ తీశామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను నేరుగా ప్రస్తావించకుండా, "మోసపూరిత జియోనిస్ట్ పాలన" అంటూ సంబోధించారు. ఈ మేరకు ఆయన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించారు.

"ఎంత గందరగోళం సృష్టించినా, ఎన్ని ప్రకటనలు చేసినా, జియోనిస్ట్ పాలన ఆచరణాత్మకంగా ఇస్లామిక్ రిపబ్లిక్ దెబ్బలకు చిత్తయి, నలిగిపోయింది" అని ఖమేనీ ఒక పోస్టులో పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఈ 'విజయం' పట్ల అభినందనలు అంటూ పోస్టు చేశారు.

ఆ వెంటనే అమెరికాను లక్ష్యంగా చేసుకుని మరో పోస్ట్ చేశారు. "మన ప్రియమైన ఇరాన్ అమెరికా ప్రభుత్వంపై సాధించిన విజయానికి నా అభినందనలు. జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనమవుతుందని భావించిన అమెరికా ప్రభుత్వం, దానిని కాపాడేందుకే నేరుగా యుద్ధంలోకి దిగింది. కానీ ఏమీ సాధించలేకపోయింది" అని ఖమేనీ అన్నారు.

గల్ఫ్‌లో మోహరించిన అమెరికా దళాలపై ఇరాన్ ప్రతీకార దాడిని కూడా ఖమేనీ ప్రస్తావించారు. "ఇస్లామిక్ రిపబ్లిక్ అమెరికా చెంప చెళ్లుమనిపించింది. ఈ ప్రాంతంలోని కీలకమైన అమెరికా స్థావరాల్లో ఒకటైన అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించింది" అని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతంలోని అమెరికా ఆస్తులపై ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయగల సత్తా కలిగి ఉందని ఖమేనీ మరో పోస్టులో హెచ్చరించారు. "ఈ ప్రాంతంలోని కీలకమైన అమెరికా కేంద్రాలను ఇస్లామిక్ రిపబ్లిక్ చేరుకోగలగడం, అవసరమని భావించినప్పుడల్లా చర్యలు తీసుకోగలగడం ఒక ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్య పునరావృతం కావచ్చు. ఏదైనా దురాక్రమణ జరిగితే, శత్రువు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.
Ali Khamenei
Iran
Israel
America
Zionist regime
Middle East conflict
Al-Udeid Air Base
US military

More Telugu News