Chandrababu Naidu: తిరుపతి, లేపాక్షిలో స్పేస్ సిటీలు: సీఎం చంద్రబాబు

Chandrababu Approves Space Cities in Tirupati Lepakshi AP Space Policy 40
  • స్పేస్ పాలసీ 4.0పై సీఎం చంద్రబాబు సమీక్ష 
  • రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఏపీ స్పేస్ పాలసీ
  • 2025-35 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాల నిర్దేశం
స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రపథాన నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి... 2025-35 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. 

గురువారం నాడు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా విద్యార్ధులు ఈ రంగం వైపు ఆకర్షితులు అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ప్లగ్ అండ్ ప్లే విధానంలో వినియోగించుకునేలా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలని, ఇందుకోసం టెక్నికల్ కమిటీ నియమించాలని ఆదేశించారు. కమ్యునికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లకు సంబంధించి టెక్నాలజీ అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 

భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదే
సమీక్షలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్‌ సోమనాథ్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. స్పేస్ విజన్ పాలసీ-2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని... అలాగే స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని... భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనని సోమనాథ్ ముఖ్యమంత్రికి తెలిపారు.  

45 శాతం వరకు రాయితీలకు ప్రతిపాదనలు

 స్పేస్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు  మరింత మెరుగ్గా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రూ.కోటి నుంచి రూ.2.5 కోట్ల వరకు మైక్రో, రూ.2.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు స్మాల్, రూ.25 కోట్ల నుంచి రూ.125 కోట్ల వరకు మీడియం, రూ.125 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు లార్జ్ కేటగిరీలుగా పెట్టుబడులను విభజించారు. రూ.500 కన్నా ఎక్కువ పెట్టుబడులను మెగా కేటగిరీ కింద పరిగణిస్తారు. 25 శాతం నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీ ఇచ్చేలా ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. అలాగే ఇందులో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశంపైనా సమీక్షలో చర్చించారు. 

లేపాక్షిలో టెక్నాలజీ స్పేస్ సిటీ
రాష్ట్రంలో రెండు స్పేస్ సిటీలు నిర్మించాలని కొత్త పాలసీలో నిర్దేశించారు. 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న లేపాక్షి స్పేస్ సిటీలో డిజైన్ అండ్ డెవలప్మెంట్‌కు ప్రాధానత్య ఇస్తారు. ఆర్ అండ్ డి, స్పేస్ స్టార్ట్ అప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, స్పేస్ అప్లికేషన్లు-సేవలకు సంబంధించి సంస్థలు ఏర్పాటు కానున్నాయి. 

తిరుపతిలో మాన్యుఫాక్చరింగ్ స్పేస్ సిటీ
తిరుపతి స్పేస్ సిటీని మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు కేటాయించారు. ఇక్కడ లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్-పేలోడ్ అసెంబ్లీ, మెకానికల్ సిస్టమ్-కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్-ఏవియానిక్స్ అసెంబ్లీ సంస్థలకే ఈ సిటీలో అవకాశం కల్పిస్తారు. బెంగళూరుకు సమీపంలో లేపాక్షి స్పేస్ సిటీ, శ్రీహరికోట -  చెన్నయ్‌కు సమీపంలో తిరుపతి స్పేస్ సిటీ ఉండటం కలిసొచ్చే అంశం. తిరుపతి స్పేస్ సిటీ నుంచి – శ్రీహరికోటకు రోడ్ కనెక్టవిటీపైనా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 

గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 2 శాతం వాటా

గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ప్రస్తుతం భారతదేశం కేవలం 2 శాతం వాటా కలిగి ఉంది. ఈరంగంలో 2033 నాటికి 44 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా స్పేస్ పాలసీ-2023... 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తోంది. ఇండియా స్పేస్ విజన్-2047 కింద... శాటిలైట్ల తయారీ, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ల లాంచింగ్, చంద్రయాన్ 4, వీనస్ ఆర్బిటరీ మిషన్, మార్స్ ల్యాండర్ మిషన్, హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్-స్పేస్ స్టేషన్, నెక్ట్స్ జెనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV), శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణం వంటివి లక్ష్యాలు. 2040 కల్లా చంద్రుడిపై మనిషి అడుగుపెట్టాలనేది ఆశయం. కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0’ను రూపొందిస్తోంది.
Chandrababu Naidu
Andhra Pradesh Space Policy
Space City Lepakshi
Space City Tirupati
ISRO Somanath
Space Technology Investments
AP Space Policy 4.0
Indian Space Program
Space Industry Andhra Pradesh
Space Startups India

More Telugu News