Mike Fremont: 69 ఏళ్ల వయసులో క్యాన్సర్ బారినపడ్డాడు... ప్రస్తుతం 103 నాటౌట్!

Mike Fremont 103 Year Old Cancer Survivor Story
  • క్యాన్సర్ ను జయించిన అమెరికన్ వృద్ధుడు
  • క్యాన్సర్ సోకగానే శస్త్రచికిత్స తప్పదన్న డాక్టర్లు
  • ఆహారం ద్వారానే నయం చేసుకున్న వృద్ధుడు
ఒహాయోకు చెందిన మైక్ ఫ్రీమాంట్ వయసు 103 సంవత్సరాలు. ఈ వయసులో చాలామంది కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే, మైక్ మాత్రం ఇప్పటికీ చురుగ్గా మెట్లు ఎక్కుతున్నారు, పడవ నడుపుతున్నారు. 98 ఏళ్ల వయసు వచ్చేవరకూ రోజుకు 10 మైళ్లు పరుగెత్తేవారంటే ఆయన ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ, సరళత, ప్రకృతితో మమేకమైన జీవనశైలే తన ఆరోగ్య రహస్యమని ఆయన చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, మైక్ ఫ్రీమాంట్‌కు 69 ఏళ్ల వయసులో క్యాన్సర్ సోకింది. అప్పుడు వైద్యులు శస్త్రచికిత్స చేయించుకోకపోతే కేవలం మూడు నెలలు మాత్రమే బతుకుతారని చెప్పారట. అయితే, విధికి తలొగ్గకుండా ఆయన తన ఆరోగ్యంపై పూర్తి నియంత్రణ తీసుకున్నారు. మిషియో కుషీ రాసిన 'ది క్యాన్సర్ ప్రివెన్షన్ డైట్' పుస్తకం స్ఫూర్తితో మొక్కల ఆధారిత మాక్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. కాలక్రమేణా, ఆయన శరీరం నుంచి క్యాన్సర్ మాయమవ్వడమే కాకుండా, కీళ్ల నొప్పులు కూడా తగ్గుముఖం పట్టాయి.

ఆహారమే ఆయనకు ఔషధం

1994 నుంచి మైక్ ఫ్రీమాంట్ స్వచ్ఛమైన, మొక్కల ఆధారిత ఆహారాన్నే తీసుకుంటున్నారు. ఇది ఖరీదైన పొడులు, సంక్లిష్టమైన వంటకాలతో కూడిన ఆధునిక డైట్ కాదు. ఆయన రోజువారీ భోజనం చాలా సాదాసీదాగా ఉంటుంది: ముడి బియ్యం (బ్రౌన్ రైస్), కేల్, క్యారెట్లు, క్యాబేజీ వంటి ఆవిరిలో ఉడికించిన కూరగాయలు, మినరల్స్ కోసం సముద్రపు నాచు, ముఖ్యంగా ప్రతిరోజూ అర కప్పు బీన్స్ తీసుకుంటారు.

బీన్స్ తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. చిక్కుళ్లు, బీన్స్ వంటి వాటిలో ఫైబర్, ప్రొటీన్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కల ఆధారిత ఆహారాలు క్యాన్సర్ నివారణలో, మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని ప్రపంచ క్యాన్సర్ పరిశోధన నిధి (World Cancer Research Fund) కూడా నొక్కి చెబుతోంది.

మైక్ ఫ్రీమాంట్ ప్రాసెస్ చేసిన చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉంటారు. ఆహారాన్ని దాని సహజ రూపంలో, అంటే ఉడకబెట్టి, ఆవిరిలో ఉడికించి లేదా పులియబెట్టి తీసుకోవడానికే ఇష్టపడతారు. నూనెలు, డీప్ ఫ్రైయింగ్ వంటివి ఆయన దరిచేరవు.

వ్యాయామం కాదు, జీవనశైలి

మైక్ ఫ్రీమాంట్ కేవలం 103 ఏళ్లు బతికి ఉండటమే విశేషం కాదు, ఆయన జీవించే విధానం ఆశ్చర్యపరుస్తుంది. 98 ఏళ్ల వయసు వరకు, వారానికి మూడు రోజులు, రోజుకు 10 మైళ్లు పరుగెత్తేవారు. అంతేకాకుండా, రోజుకు 48 సార్లు మెట్లు ఎక్కేవారు. ఇప్పటికీ పుల్-అప్స్ చేస్తారు, తేలికగా పడవ నడుపుతారు.

ఆయనకు వ్యాయామం అంటే ఒక పనిలా కాకుండా, శ్వాస తీసుకోవడం లాంటిది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుందని, కీళ్లు, మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని సీడీసీ (Centers for Disease Control and Prevention) చెబుతోంది. మైక్ ఎప్పుడూ ట్రెండ్స్ లేదా వర్కౌట్ ప్లాన్‌లను అనుసరించలేదు. తనకు సహజంగా అనిపించిన మార్గాల్లో ప్రతిరోజూ చురుగ్గా ఉండేవారు.

నిద్ర, ప్రకృతితో మమేకం

ఆధునిక జీవనశైలిలో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ మైక్‌కు నిద్ర చాలా పవిత్రమైనది. ఆయన ప్రతి రోజు 8-9 గంటలు నిద్రపోతారు. అలారమ్, నిద్రపోయే ముందు స్క్రీన్ టైమ్, ప్రత్యేకమైన దినచర్యలు ఏవీ ఉండవు. కేవలం ప్రశాంతమైన, అవాంతరాలు లేని నిద్ర మాత్రమే.

ఈ విషయాన్ని శాస్త్రీయ అధ్యయనాలు కూడా బలపరుస్తున్నాయి. కణాల మరమ్మత్తుకు, వాపు తగ్గడానికి, మెదడు పనితీరుకు నాణ్యమైన నిద్ర అవసరం. మైక్ విషయంలో, శరీరం యొక్క సహజమైన విశ్రాంతి అవసరాన్ని గౌరవించడం అద్భుతాలు చేసిందని చెప్పవచ్చు.

మైక్ ఫ్రీమాంట్ తాను వైద్యులకు దూరంగా ఉన్నందుకు గర్వపడటం లేదు... వారి అవసరం తనకు అంతగా రాలేదని భావిస్తారంతే. ఆహారమే తనకు క్యాన్సర్ నయం చేసిందని ఆయన గట్టిగా నమ్ముతారు. ప్రకృతితో మమేకమై జీవిస్తారు. కొంత ఆహారాన్ని తనే పండించుకుంటారు, ఫిల్టర్ చేసిన నీటిని తాగుతారు, రసాయనాలతో కూడిన ఉత్పత్తులకు దూరంగా ఉంటారు, బయట ప్రకృతిలో గడపడాన్ని ఆస్వాదిస్తారు.

ప్రకృతితో ఈ అనుబంధం కేవలం మాటలకే పరిమితం కాదు. పచ్చని ప్రదేశాలలో సమయం గడపడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ తగ్గుతుందని, నిద్ర మెరుగుపడుతుందని, మట్టిలో ఉండే ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల ద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మైక్ అలవాట్లు, ఆయనకు తెలియకుండానే ఈ పరిశోధనల ఫలితాలను ప్రతిబింబిస్తాయి. ఆయన జీవన విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
Mike Fremont
Cancer survivor
Macrobiotic diet
Plant based diet
Healthy aging
Longevity
World Cancer Research Fund
Natural living
Exercise lifestyle
Ohio

More Telugu News