Shubhanshu Shukla: డాకింగ్ విజయవంతం... చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా

Shubhanshu Shukla Successfully Docks at International Space Station
  • యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి భారత వ్యోమగామి
  • చరిత్రలో ఇదే తొలిసారి
  • శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో ప్రవేశం
  • అమెరికా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయోగం
  • గురువారం సాయంత్రం విజయవంతంగా స్పేస్‌క్రాఫ్ట్ డాకింగ్
  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు పరిశోధనలు
అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని అందుకుంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌) విజయవంతంగా అడుగుపెట్టారు. వారి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే (డాకింగ్) ప్రక్రియ గురువారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. ఈ ఘనతతో అంతరిక్ష యాత్రల్లో భారత్ తనదైన ముద్రను మరోసారి చాటింది. ఐఎస్ఎస్ లో కాలు మోపడం ద్వారా శుక్లా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయ వ్యోమగామిగా ఘనత అందుకున్నాడు.

వివరాల్లోకి వెళితే, యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్‌, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ -విస్నీవ్‌స్కీ, హంగరీకి చెందిన టిబర్‌ కపులు అంతరిక్షయానం చేపట్టారు. భారత కాలమానం ప్రకారం బుధవారం (జూన్ 25) మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా వీరి స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

దాదాపు ఒక రోజు ప్రయాణం అనంతరం, గురువారం (జూన్ 26) సాయంత్రం ఈ వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:03 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ను ఐఎస్‌ఎస్‌తో అనుసంధానించే డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అనంతరం వ్యోమగాములు నలుగురూ ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా సహా వ్యోమగాముల బృందం 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనుంది. ఈ సమయంలో వారు పలు పరిశోధనలు, ప్రయోగాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలకు మరింత ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Shubhanshu Shukla
Axiom-4 Mission
International Space Station
ISS
Indian Astronaut
Space Research
Peggy Whitson
Falcon-9 Rocket
Spacecraft Docking

More Telugu News