Gajendra Shekhawat: సీఎం చంద్రబాబును కలిసిన కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్

Gajendra Shekhawat met CM Chandrababu on AP Tourism Development
  • ఇవాళ ఏపీలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యటన
  • రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • అనంతరం ఉండవల్లి రాక... స్వాగతం పలికిన మంత్రి నారా లోకేశ్
  • సీఎం చంద్రబాబుతో పలు అంశాలు చర్చించిన షెకావత్
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబుతో ఏపీ అభివృద్ధి, కేంద్ర సహకారంపై చర్చించారు. అంతకుముందు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర మంత్రి షెకావత్‌కు స్వాగతం పలికారు.

కేంద్ర మంత్రి షెకావత్ ఇవాళ రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని తెలిపారు. "అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ దార్శనికతతో దేశంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది" అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

"డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా భారత్‌లో ఈ వృద్ధి వేగంగా ఉంది" అని షెకావత్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉందని, రాష్ట్రం ఆధ్యాత్మికంగా కూడా పురోగమిస్తోందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం సుమారు రూ.450 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని షెకావత్ వెల్లడించారు. "స్వదేశీ దర్శన్, ప్రసాద్, సాక్షి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ (సీబీడీడీ) వంటి వివిధ స్కీమ్‌ల ద్వారా కేంద్రం పర్యాటక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. స్వదేశీ దర్శన్ 2.0 కింద అరకు, బొర్రా గుహలు, లంబసింగి, సూర్యలంక బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆధ్యాత్మిక టూరిజానికి బాటలు వేస్తున్నాం" అని తెలిపారు. అమరావతి, శ్రీశైలం దేవాలయాల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని, అన్నవరం దేవాలయంలో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని ఆయన వివరించారు.

అన్ని విధాలా కేంద్రం సహకారం: పురందేశ్వరి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తాము గతంలోనే చెప్పామని గుర్తుచేశారు. ప్రజలు తమపై నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించారని ఆమె అన్నారు. "వికసిత్ భారత్‌లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం కావాలి. అమరావతి, పోలవరం వంటి అన్ని కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది" అని పురందేశ్వరి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను గుర్తించి, వాటి అభివృద్ధికి కేంద్రం సహాయం అందిస్తోందని, అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నేడు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని ఆమె వివరించారు.
Gajendra Shekhawat
Chandrababu Naidu
Andhra Pradesh Tourism
Narendra Modi
Purandeswari
AP Development
Akhanda Godavari Project
Tourism Development
Central Government Funds
Double Engine Government

More Telugu News