Election Commission of India: ఆరేళ్లుగా పోటీ చేయని రాజకీయ పార్టీలు... ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

Election Commission to delist inactive political parties
  • ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు
  • ఆరేళ్లుగా యాక్టివ్‌గా లేని 345 పార్టీల డీలిస్టింగ్ ప్రాసెస్ షురూ
  • సంబంధిత పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని గుర్తింపు
  • దేశవ్యాప్తంగా 2,800కు పైగా గుర్తింపు లేని నమోదిత పార్టీలు
  • వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలపై వేటు
దేశంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, ఆరేళ్లుగా ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిష్క్రియంగా ఉన్న పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టి సారించింది. 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనని 345 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను (రిజిష్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీస్‌ - ఆర్‌యూపీపీ) గుర్తించి, వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ పార్టీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో వాటి కార్యాలయాలు కూడా ఉనికిలో లేవని ఎన్నికల సంఘం తన పరిశీలనలో గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సదరు పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం వద్ద సుమారు 2,800కు పైగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి.

సాధారణంగా, ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు పొందాలంటే, జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి లేదా నిర్దిష్ట సంఖ్యలో అసెంబ్లీ లేదా లోక్‌సభ సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలను అందుకోలేని పార్టీలను కేవలం నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు. ఇటువంటి పార్టీలు సుదీర్ఘకాలం పాటు ఎటువంటి ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, కనీసం పార్టీ కార్యాలయాలను కూడా నిర్వహించకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Election Commission of India
Political Parties
ECI
Registered Unrecognized Political Parties

More Telugu News