Revanth Reddy: డ్రగ్స్ వైపు చూస్తే వెన్ను విరుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

Revanth Reddy Warns Against Drugs in Telangana
  • ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ డ్రగ్స్‌ హబ్‌గా మారితే విఫలమైనట్టేనన్న ముఖ్యమంత్రి
  • గంజాయి, డ్రగ్స్‌ వైపు చూస్తే వెన్ను విరుస్తామని ప్రమాణ స్వీకారం రోజే చెప్పానన్న రేవంత్
  • డ్రగ్స్‌ నివారణకు ప్రత్యేకంగా ‘ఈగల్‌’ అనే విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
  • విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత అని స్పష్టం
తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తోందని, అలాంటిది గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారితే అది మనందరి వైఫల్యమే అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరిక చేశానని, తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్‌ వైపు కన్నెత్తి చూసినా వారి వెన్ను విరుస్తామని స్పష్టం చేశానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘తెలంగాణ అంటేనే ఉద్యమాలు, పోరాటాలకు పురిటిగడ్డ. అలాంటి గడ్డ డ్రగ్స్‌కు నిలయంగా మారితే అది రాష్ట్రానికే అవమానకరం’’ అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు డ్రగ్స్‌ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారని, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు. శత్రుదేశాలు ఒక దేశాన్ని దెబ్బతీయడానికి ఎలాంటి మార్గాలైనా ఎంచుకోవచ్చని, కొవిడ్‌ లాంటి వైరస్‌లను లేదా డ్రగ్స్‌ను కూడా ప్రయోగించవచ్చని అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వారు తెలంగాణ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాలంటేనే వణికిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు, పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఒకప్పుడు యుద్ధాలు, సైనికులు అనగానే పంజాబ్‌ రాష్ట్రం గుర్తుకు వచ్చేదని, అలాంటి పంజాబ్‌ ఇప్పుడు డ్రగ్స్‌ మహమ్మారి కోరల్లో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. యువతను సరైన మార్గంలో నడిపించి, అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే కొత్త స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు రాకపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

డ్రగ్స్‌ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని, పౌరులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో పిల్లల ప్రవర్తనను గమనించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సబ్జెక్టు టీచర్లు, పీఈటీలతో పాటు ‘బిహేవియర్‌ అబ్జర్వర్స్‌’ను కూడా నియమించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల రూపంలో కూడా గంజాయి, డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారని, ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో డ్రగ్స్‌ దొరికితే సంబంధిత యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అన్నారు.

గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ‘ఈగల్‌’ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ‘ఈగల్‌’ బృందం నిరంతరం నిఘా పెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటులు రామ్‌చరణ్‌, విజయ్‌దేవరకొండ పాల్గొనడంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ఎంత బిజీగా ఉన్నప్పటికీ, యువతకు మంచి సందేశం ఇవ్వాలనే తపనతో, ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలనే ఆకాంక్షతో వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు’’ అని అన్నారు. ఈ సదస్సులో నిర్మాత దిల్‌రాజు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Revanth Reddy
Telangana
Drugs
Drug Prevention
Ganja
Narcotics
Youth

More Telugu News