Amudala Ramesh: కామారెడ్డి రైతు కన్నీటి గాథ: ఎండిపోతున్న పంటపొలానికి బకెట్లతో నీళ్లు!

Amudala Ramesh Kamareddy Farmers Struggle with Drying Crops
  • కామారెడ్డి జిల్లాలో రైతులకు తప్పని కష్టాలు
  • మూడు వారాలుగా వర్షాల్లేక ఎండిపోతున్న మొక్కజొన్న
  • ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి బకెట్లతో పోస్తున్న రైతు
  • ఐదెకరాల కౌలు భూమిలో సాగు చేస్తున్న అన్నదాత
ఆశగా ఆకాశం వైపు చూస్తూ, ఎండిపోతున్న పంటను ఎలాగైనా బతికించుకోవాలని ఒక రైతు పడుతున్న ఆవేదన చూపరులను కలచివేస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో, ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన ఆముదాల రమేష్ అనే రైతు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఆముదాల రమేష్ ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగుచేశాడు. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని పలకరించడంతో, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పంట బాగా పండుతుందని రమేష్ ఎంతో సంతోషపడ్డాడు. అయితే, అతడి ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలో కాస్త వర్షాలు కురిసినా, గత మూడు వారాలుగా వరుణుడు జాడలేకుండా పోయాడు. దీంతో వేసిన మొక్కజొన్న పంట నీరులేక ఎండిపోయే దుస్థితికి చేరుకుంది.

పంట కళ్లెదుటే ఎండిపోతుండటంతో తట్టుకోలేని రమేష్, ఎలాగైనా దాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. రోజూ నీటి ట్యాంకర్లను డబ్బులిచ్చి తెప్పించుకుంటున్నాడు. ఆ నీటిని బకెట్లతో నింపి, మొక్కజొన్న మొక్కల మొదళ్లలో పోస్తూ పంటకు జీవం పోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న పంటకు ఇలా బకెట్లతో నీరు అందించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా, కౌలుకు తీసుకున్న భూమి, పెట్టిన పెట్టుబడి వృథా కాకూడదన్న తపనతో అతడు ఈ భగీరథ ప్రయత్నం కొనసాగిస్తున్నాడు.
Amudala Ramesh
Kamareddy farmer
crop failure
maize crop
Bikkanur
Jangampalli village

More Telugu News