CR Patil: సింధు జలాల కోసం పాక్ విన్నపాలు... భారత్ వైఖరిలో మార్పు ఉండబోదన్న సీఆర్ పాటిల్

CR Patil says no change in India stance on Indus Waters Treaty
  • పహల్గామ్ లో ఉగ్రదాడి
  • సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్
  • నీటికి కటకటలాడుతున్న పాక్
  • సింధు జలాల ఒప్పందం పునరుద్ఱరించాలంటూ భారత్ లకు లేఖలు
  • పాక్ ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోబోమన్న సీఆర్ పాటిల్ 
సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా భారత్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గురువారం నాడు కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్ ఎన్ని లేఖలు రాసినా, వాటిని భారత్ ఏమాత్రం పట్టించుకోదని, ఒప్పంద పునరుద్ధరణపై సమీక్షించే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల "రక్తం, నీళ్లు ఏకకాలంలో ప్రవహిస్తాయి" అంటూ యుద్ధానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ బెదిరింపులను మంత్రి పాటిల్ తేలిగ్గా కొట్టిపారేశారు. "బిలావల్ రాజకీయ ప్రయోజనాల కోసం తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయన ఉత్తరకుమార ప్రగల్భాలకు మేం భయపడం" అని ఘాటుగా బదులిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గతవారమే ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని ప్రకటించారు.

భారత్ తమకు రావాల్సిన నీటి వాటాను నిరాకరిస్తే యుద్ధమేనని బిలావల్ హెచ్చరించినప్పటికీ, ఉగ్రవాదంపై చర్చలు, సహకారం అవసరమని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకుంటోందని, ఎఫ్ఏటీఎఫ్ విషయంలో పాక్ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.

ఇదిలావుండగా, కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల వివాదాలపై విచారణ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకును భారత్ కోరింది. పహల్గామ్ దాడి తర్వాత ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ అభ్యర్థన చేసింది. దీనిపై ప్రపంచ బ్యాంకు ఇంకా స్పందించాల్సి ఉంది. ఒప్పందం సస్పెన్షన్ అనంతరం పాక్‌తో వాణిజ్యాన్ని కూడా భారత్ నిలిపివేసింది.
CR Patil
Indus Waters Treaty
Pakistan
Bilawal Bhutto Zardari
India Pakistan relations
water sharing agreement
Kishanganga project
Ratle hydro project
FATF
terrorism

More Telugu News