Reliance Industries: కర్నూలు జిల్లాలో రిలయన్స్ భారీ ప్లాంట్.. రూ.1622 కోట్లతో కూల్ డ్రింక్స్ తయారీ!

Reliance Industries to Set Up Mega Plant in Kurnool
  • కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
  • శీతలపానీయాలు, జ్యూస్‌ల తయారీ యూనిట్
  • ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1200 మంది స్థానికులకు ఉపాధి
  • 80 ఎకరాల భూమి కేటాయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1622 కోట్ల పెట్టుబడితో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.

వివరాల్లోకి వెళితే, శీతలపానీయాలు, పండ్ల రసాలు, మరియు డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించిన పరిశ్రమను స్థాపించేందుకు రిలయన్స్ సంస్థ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.

ఈ పరిశ్రమను కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపీఐఐసీ)కు చెందిన ల్యాండ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున మొత్తం 80 ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం అవసరమైన ప్రోత్సాహకాలను కూడా అందజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల స్థానికంగా సుమారు 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాబోయే ఏడాది డిసెంబర్ నెలకల్లా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాలని రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎపీఐఐసీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌కు పరిశ్రమలు, వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రాయలసీమ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Reliance Industries
Reliance
Kurnool
Andhra Pradesh
Cool Drinks
Food Processing
Industrial Development
Chandra Babu Naidu
APIIIC
Orvakal

More Telugu News