Donald Trump: త్వరలో భారత్‌తో చాలా పెద్ద డీల్.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump Hints At Great Trade Deal With India
  • భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడి సంకేతం
  • త్వరలోనే ఈ చాలా పెద్ద డీల్ ఉండొచ్చని వైట్‌హౌస్‌లో వ్యాఖ్య
  • కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ముగిసిన నాలుగు రోజుల రహస్య చర్చలు
  • ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం
  • మార్కెట్ యాక్సెస్, సుంకాల తగ్గింపుపై చర్చల్లో ప్రధానంగా దృష్టి
భారత్‌తో ఒక అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే ఈ చాలా పెద్ద డీల్‌ కార్యరూపం దాల్చవచ్చని ఆయన గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కొద్ది వారాల క్రితం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధుల మధ్య ఢిల్లీలో చర్చలు ముగిసిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వైట్‌హౌస్‌లో జరిగిన 'బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్'లో ట్రంప్ మాట్లాడుతూ, భారత్‌తో ఒక గొప్ప ఒప్పందం రాబోతోందని తెలిపారు. ఇటీవలే చైనాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తుచేసిన ఆయన, తదుపరి భారీ ఒప్పందం భారత్‌తోనే ఉండొచ్చని అన్నారు. "ప్రతి ఒక్కరూ మాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. మేము చైనాతో నిన్ననే ఒప్పందంపై సంతకాలు చేశాం. కొన్ని గొప్ప ఒప్పందాలు చేస్తున్నాం. త్వరలో భారత్‌తో ఒకటి రాబోతోంది. అది చాలా పెద్దది. మేము భారత మార్కెట్లను తెరుస్తున్నాం" అని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కొద్ది వారాల క్రితం న్యూఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక చర్చలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. జూన్ 10న ముగిసిన ఈ నాలుగు రోజుల సమావేశాల్లో ఇరు దేశాల ప్రతినిధులు రహస్యంగా చర్చలు జరిపారు. అమెరికా తరఫున ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయ (USTR) అధికారులు, భారత్ తరఫున వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించడం, సుంకాల తగ్గింపు, ఇతర వాణిజ్య అవరోధాల తొలగింపు వంటి అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అయితే, అన్ని దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని కూడా ట్రంప్ ఇదే కార్యక్రమంలో స్పష్టం చేశారు. "మేము అందరితో ఒప్పందాలు చేసుకోబోం. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి.. 25, 35, లేదా 45 శాతం పన్నులు చెల్లించమని చెబుతాం. అదే సులువైన మార్గం" అని ఆయన అన్నారు.
Donald Trump
India US trade deal
US India trade
India trade agreement
trade negotiations
India import export
US trade policy
bilateral trade
Indian market
trade war

More Telugu News